
పాడి రైతులను ప్రోత్సహించాలి
● గవర్నర్ కంభంపాటి హరిబాబు
భువనేశ్వర్: పాడి రైతులకు ప్రోత్సాహమివ్వాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సూచించారు. మంగళవారం కటక్ అరిలో ప్రాంతం గోవింద్‌పూర్‌లోని ఓంఫెడ్ మెగా డైరీ ప్లాంట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన అనుబంధ వర్గాలతో ఈ విషయమై లోతుగా చర్చించారు. పాడిరైతు సంక్షేమంతో ముడిపడిన పలు రైతాంగ పథకాలు అమలు చేయడంలో ఎటువంటి అడ్డంకి లేకుండా సత్వర చర్యలు చేపట్టేందుకు సదా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంపొందించేందుకు ప్రభుత్వ పథకాల అమలు, కార్యాచరణతో రైతాంగానికి ప్రోత్సహించేందుకు బ్యాంకులు ముందడుగు వేయాలని కోరారు. ఇది పాల ఉత్పత్తి మరియు అవసరాల మధ్య అంతరాన్ని పూరించడంతో పెరుగుతున్న అవసరాలను తీర్చడంలో దోహదపడుతుందన్నారు. రైతులకు మద్దతు ఇచ్చే ముఖ్యమంత్రి కామధేను యోజన లబ్ధి పొందడంలో అనుబంధ రైతాంగం ఇబ్బంది పడకుండా పలు వెసులుబాటు సూచనలను గవర్నర్ తెలియజేశారు. ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై)కి అనుసంధానించి బ్యాంకు రుణాలు మంజూరుతో వ్యాపారాలను ప్రారంభించడం, విస్తరించడానికి రైతాంగానికి బలమైన ఆర్థిక వనరుగా ఆయా సంస్థలు చురుకై న పాత్ర పోషించాలన్నారు.
లబ్ధిదారుల జాబితాను అందించాలి
ముఖ్యమంత్రి కామధేను యోజన కింద లబ్ధిదారుల వివరణాత్మక జాబితాను బ్యాంకులకు అందించాలని గవర్నర్ ఓంఫెడ్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఓంఫెడ్ అధికారులు తనను నేరుగా సంప్రదించవచ్చని తెలియజేశారు. గవర్నర్ తన పర్యటనలో భాగంగా ఓంఫెడ్ ప్లాంట్‌లో ప్రయోగశాల, నెయ్యి విభాగం మరియు ఉత్పత్తుల గ్యాలరీతో సహా వివిధ విభాగాలను సందర్శించారు. ఓంఫెడ్ అధికారులు ప్లాంట్ కార్యకలాపాలు, నిర్వహణ, మార్కెటింగ్ వ్యూహాలు మరియు ఉత్పత్తి శ్రేణిపై వివరణాత్మక పవర్ పాయింట్‌ను సమర్పించారు. నగర ప్రాంతాల్లో ఓంఫెడ్ పాలు మరియు ఇతర ఉత్పత్తులను ఇంటి ముంగిటకు చేర్చే విధానాన్ని అమలు చేయాలని గవర్నర్ ప్రోత్సహించారు. మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్ కుమార్ వశిష్ట్, ఓంఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ అమృత్ కులంగే, కటక్ జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే తదితరులు హాజరయ్యారు.

పాడి రైతులను ప్రోత్సహించాలి

పాడి రైతులను ప్రోత్సహించాలి

పాడి రైతులను ప్రోత్సహించాలి