
ఎరువుల గోదాములపై ఆకస్మిక దాడులు
రాయగడ: బిసంకటక్‌లోని నాలుగు ఎరువుల గోదాముల్లో అధికారులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. ప్రభుత్వ నిర్ధారిత ధర కన్నా అధికంగా వ్యాపారులు విక్రయిస్తూ రైతులను మోసగిస్తున్నారనే ఆరోపణల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. దాడుల్లో భాగంగా ముగ్గురు గోదాముల నిర్వాహకులకు నోటీసులను జారీ చేశారు. బిసంకటక్ తహసీల్దార్ కె.వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బిసంకటక్ సమితి వ్యవసాయ శాఖ అధికారి ఘనస్యామ్ హుయిక, పోలీసులతో ఏర్పాటైన ప్రత్యేక స్క్వాడ్ ఈ మేరకు సోమవారం దాడులను చేపట్టింది. గోదాముల్లో నిల్వ ఉంచిన ఎరువుల వివరాలను సేకరించిన అధికారులు అందుకు సంబంధించిన అనుమతి పత్రాలను తనిఖీ చేశారు.
సూర్య నారాయణ త్రిపాఠి మృతి
కొరాపుట్: ప్రతిపక్ష బిజూ జనతా దళ్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు సూర్య నారాయణ త్రిపాఠి(72) మృతి చెందారు. మంగళవారం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అనంతరం మృతదేహాన్ని స్వస్థలం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. పాతికేళ్ల క్రితం జనతా దళ్ నుంచి విడిపోయి బిజూ జనతా దళ్ పార్టీ ఆవిర్భవించింది. దీంతో ఆరోజుల్లో నబరంగ్‌పూర్ జిల్లాలో పార్టీ అభివృద్ధికి సూర్య నారాయణ ఎంతోకృషి చేశారు. న్యాయవాదిగా ప్రజా సమస్యలపై లేఖాస్త్రాలతో పోరాటంలో చేయడంలో పేరు సంపాదించారు. మృతదేహానికి బీజేడీ రాజ్యసభ ఎంపీ మున్నా ఖాన్, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జడేశ్వర్ ఖడంగా, ప్రకాష్ మిశ్ర తదితరులు నివాళులర్పించారు.
సెంచూరియన్‌లో
అవగాహన సదస్సు
పర్లాకిమిడి: పట్టణానికి సమీపంలోని ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణపై అవగాహన సదస్సును ఎస్పీ జ్యోతింద్ర పండా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తపస్తా ప్రహరాజ్ మాట్లాడుతూ.. సున్నితమైన యువత మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడకుండా పెద్దలు, విద్యాసంస్థలు, అధికారులు మద్దతు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డా.అనితా పాత్రో తదితరులు పాల్గొన్నారు.
పట్టుబడిన మహిళా
దొంగలు
భువనేశ్వర్: రైలులో ప్రయాణికుల నుంచి నగలు, నగదు దోచుకున్న మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. జార్ఖండ్ నుంచి పూరీకి ప్రయాణిస్తున్న ఒక కుటుంబం నుంచి రూ.17,000ల నగదుతో పాటు 2 మంగళ సూత్రాలు, 3 లాకెట్లను దొంగిలించారు. రైలులో గందరగోళం సృష్టించి వ్యానిటీ బ్యాగ్‌లో దాచుకున్న ఈ సొత్తుని దొంగిలించినట్లు గుర్తించి రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్) వర్గాలకు సమాచారం అందజేశారు. ప్రభుత్వ రైల్వే పోలీసులతో (జీఆర్‌పీ) కలిసి వీరు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గాలించి అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన మేరకు అరెస్టు చేశారు. వారి నుంచి దొంగిలించిన నగదు, ఆభరణాలు స్వాధీనపరచుకుని బాధిత వర్గానికి అందజేశారు.

ఎరువుల గోదాములపై ఆకస్మిక దాడులు

ఎరువుల గోదాములపై ఆకస్మిక దాడులు