
పార్టీ పటిష్టతకు కృషి చేసినవారికే పగ్గాలు
రాయగడ: కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసినవారికే డీసీసీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం యోచిస్తోందని బెంగుళూర్ శివాజీనగర్ ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ స్పష్టం చేశారు. రాయగడలో మంగళవారం పర్యటించిన ఆయన ఈ మేరకు స్థానిక మున్సిపాలిటీ టౌన్ హాల్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచే రాయగడ వంటి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే నాయకుడికే డీసీసీ పగ్గాలను అధిష్టానం ఇస్తుందన్నారు. ఈ మేరకు అధిష్టానం ఆదేశాల మేరకు ఈ జిల్లాలో తాను ఆరు రోజుల పాటుగా పర్యటించి కార్యకర్తలతో సమావేశమై తుది నివేదికను అధిష్టానానికి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీని పటిష్టపరచాలనే ఉద్దేశంతో అధిష్టానం తనను జిల్లాలో పర్యటించేందుకు అదేశించిందని వివరించారు. జిల్లాలోని 11 సమితుల్లో పర్యటించి కార్యకర్తల మనోభావాలను తెలుసుకుంటానన్నారు.
సత్తా చాటుతాం
ఒడిశా రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని అర్షద్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. ప్రతీ జిల్లాలో పార్టీ పటిష్టతకు వ్యూహాత్మకంగా పార్టీ ముందుకెళ్తుందని పేర్కొన్నారు. గడిచిన రెండు దశాబ్ధాలకు పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేడీతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రస్తుతం అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ఆయనతో పాటు పీసీసీ పరిశీలకులు చిన్మయ్ సుందర్ దాస్, అఖిల్ భొత్ర తదితరులు పాల్గొన్నారు.
సమష్టిగా పనిచేయండి
కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ సమష్టిగా పనిచేయాలని కార్యకర్తలకు రిజ్వాన్ పిలుపునిచ్చారు. అంతకుముందు జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా పార్టీ అభివృద్ధికి సైనికుల్లా పనిచేయాలని సూచించారు. గత సాధారణ ఎన్నికల్లో రాయగడ జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు కొరాపుట్ లోక్‌సభ స్థానం కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడం శుభసూచికమని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పండ, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్

పార్టీ పటిష్టతకు కృషి చేసినవారికే పగ్గాలు