
దోపిడీ కేసులో ఏడుగురు అరెస్టు
రాయగడ: సదరు పోలీస్‌స్టేషన్ పరిధి రఫ్‌కొన కూడలిలో సోమవారం జరిగిన దోపిడీ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు సెల్‌ఫోన్లు, రూ.2.83 లక్షల నగదుతో పాటు దోపిడీకి వినియోగించే బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం సదరు పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఏఎస్పీ అమూల్య కుమార్ దళ్, ఐఐసీ ప్రసన్న కుమార్ బెహరలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఇదీ విషయం..
గజపతి జిల్లా గారబంద పోలీస్‌స్టేషన్ పరిధి లాబయగడ గ్రామానికి చెందిన టి.ఉమారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు మిత్రులతో కలిసి కారులో జయపురం నుంచి రాయగడకు రూ.9 లక్షల నగదుతో సోమవారం వస్తున్నాడు. ఆ సమయంలో రఫ్‌కొన కూడలిలో సునితా నాయక్ అనే మహిళ హోంగార్డు దుస్తుల్లో కారు ఎదురుగా నిలబడి ఆపింది. కారులో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడుతున్న సమయంలో ఒక బొలేరోలో మరో ఏడుగురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. వారిలో నలుగురు హోంగార్డు దుస్తులతో ఉన్నారు.
వీరంతా బాధితుడు ఉమారెడ్డిని బెదిరించి ఇంత మొత్తం నగదు ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఎస్పీ కార్యాలయానికి రమ్మని చెప్పి తమ వెంట తీసుకొచ్చిన బొలేరోలొ ఉమారెడ్డిని కొంతదూరం వరకు తీసుకెళ్లారు. అనంతరం ఒక ప్రాంతంలో సునీత అనే మహిళను దింపేసి, తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతడిని బెదిరించి, రూ.9 లక్షల నగదుతో పాటు 40 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కొని అక్కడే ఉమారెడ్డిని విడిచిపెట్టి పరారయ్యారు. దీంతో బాధితుడు సదరు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో జిల్లాలోని బిసంకటక్ బడసాహికి చెందిన హోంగార్డు ఇంద్రమణి కరకరియా, కల్యాణ సింగుపూర్ పల్లిగాం గ్రామానికి చెందిన హోంగార్డు దిలిప్ గరడియా, బడ గ్రామానికి చెందిన తమన ప్రస్కా, హిరా నాయక్ గరాడియా, టికిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తోటాగుడ గ్రామానికి చెందిన సింహాచల్ మాఝి, రాధిక హల్వ అలియాస్ సునితా హల్వ, ముకేష్ నాగ్‌లు ఉన్నారు.

దోపిడీ కేసులో ఏడుగురు అరెస్టు