
క్రిమినల్స్‌పై ఉక్కుపాదం
● నేరస్తుల కట్టడిలో రాజీలేని చర్యలు
● ఎస్పీ రోహిత్ వర్మ వెల్లడి
కొరాపుట్: జయపూర్ పట్టణాన్ని నేర రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ జయపూర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సుదీర్ఘంగా ప్రసంగించారు. దశాబ్దాలుగా ఉన్నటువంటి నేరస్తుల ఏరివేతలో రాజీలేని చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ ఏడాది మార్చి నుంచి దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ కేసుల్లో 81 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ కేసుల్లో 30 ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్, 40 బంగారు రింగులు, 10 మంగళసూత్రాలు, రూ.6.75 లక్షల నగదు సీజ్ చేశామన్నారు. బెదిరింపు ఘటనల్లో మరో పదిమందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాలో 31 మంది కరుడుగట్టిన నేరస్తులను అరెస్ట్ చేసి 2,501 కేజీల గంజాయి, 585 ఇంజెక్షన్లు, 7 కార్లు, 3 తుపాకీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కిడ్నాప్ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరికొన్ని దాడుల కేసుల్లో మరో 19 మందిని అరెస్టు చేశామన్నారు.
అనుక్షణం పోలీసు నిఘా
పట్టణంలో అనుక్షణం పోలీసు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నేరస్తులు తమ నేర ప్రవర్తన వదలి సామాన్య జీవితం గడపాలని పిలుపునిచ్చారు. బెయిల్ మీద వచ్చిన వారి మీద కూడా పోలీసు నిఘా ఉంటుందన్నారు. నేరస్తుల పాత కేసుల జాబితా సిద్ధం చేసి కోర్టులకు సమర్పించి బెయిల్ అడ్డుకుంటామన్నారు. ఎక్కడైనా బెదిరింపులకు పాల్పడితే 94389 16918 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇకపై గంజాయి అక్రమ రవాణా చేసి పట్టుబడితే వారి పేరు మీద ఉన్న ఆస్తులు ప్రభుత్వపరం చేసే చర్యలు ఉంటాయని గుర్తు చేశారు. కాగా జయపూర్ చరిత్రలో తొలిసారిగా అత్యధిక 15 మంది నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్పీ రోహిత్ వర్మ నేరస్తుల అరెస్టులను అధికారికంగా ప్రకటించారు. సమావేశంలో ఎస్‌డీపీవో పార్ధవ్ కశ్యప్ తదితరులు ఉన్నారు.