
లక్ష్మీ బస్సు ప్రారంభం
కొరాపుట్: ప్రభుత్వ లక్ష్మీబస్సుని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత మంగళవారం ప్రారంభించారు. ఈ బస్సు ఒడియా పెంట, పంచడ, కక్కిరిగుమ్మ, చంపి, తోయాపుట్, లక్ష్మీపూర్ సమితి కేంద్రాల గుండా ప్రయాణం చేస్తుంది. మారుమూల గిరిజన గ్రామాల ప్రజలను లక్ష్మీపూర్ చేర్చడానికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి చైర్మన్ సువై కులసిక, జిల్లా పరిషత్ సభ్యురాలు పింకి హిమరిక, ఒడియా పెంట సర్పంచ్ బన్సి మండిగా, పూర్ణ మండింగా తదితరులు పాల్గొన్నారు.
ఈశ్వర తొలియ విగ్రహం ఏర్పాటు చేయండి
జయపురం: సొంత గ్రామంలో జవాన్ ఈశ్వర్ తొలియ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి ఖెందుగుడ గ్రామ పంచాయతీ బొడగుడ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీడీవోకు ఒక వినతిపత్రం సోమవారం అందజేశారు. డిసెంబర్ నాటికి అత్యంత వేగంగా విగ్రహం ఏర్పాటును పూర్తి చేయాలని విన్నవించారు.
నీటికుంటలో పడి బాలిక మృతి
కొరాపుట్: నీటికుంటలో పడి బాలిక మృతి చెందిన ఘటన కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి ఖోజా గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఉదయం స్కూలుకు వెళ్లిన బాలిక కరిస్మిత హబిక(7) తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామంలో నిర్మిస్తున్న మెగా తాగునీటి పథకం కోసం తవ్విన నీటికుంటలో ఆమె మృతదేహం కనబడింది. వెంటనే గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. నారాయణపట్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాముకాటుతో బాలుడు మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి దామాగూడ గ్రామంలో రామా కబాసీ (17) అనే బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. రామా కబాసీ సోమవారం రాత్రి భోజనాలు చేసిన అనంతరం తమ ఇంటి బయట వరండాలో తండ్రితో కలిసి నిద్రించాడు. అయితే అర్థరాత్రి ఒక విష సర్పం బాలుడి ఎడమ చెవిభాగంలో కాటు వేసింది. బాలుడు కేకలు వేయడంతో తండ్రి లేచి చూస్తే నల్ల త్రాచుపాము కన్పించింది. అదే కాటు వేసింది అని తెలుసుకొని గ్రామస్తుల సాయంతో వెంటనే కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. కలిమెల పోలీసులు విషయం తెసుకొని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చెరువులో మునిగి మహిళ మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి కేంద్రానికి చెందిన పార్వతీ మడ్కమి (45) మంగళవారం ఉదయం దుస్తులు ఉతకడానికి వెళ్లి చెరువులో కాలుజారి పడిపోయింది. మధ్యాహ్నం అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా జాడ కనిపించలేదు. అయితే అటుగా వచ్చిన కొంతమంది మహిళలకు ఆమె చీర తేలుతూ కనిపించడంతో సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమె కుమారుడు విజయ్ మడ్కమి చెరువు వద్దకు వచ్చి ఆమెను బయటకు తీసి కలిమెల ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలియడంతో ఐఐసీ ముకుందో మేల్కా ఆరోగ్య కేంద్రానికి వచ్చి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

లక్ష్మీ బస్సు ప్రారంభం

లక్ష్మీ బస్సు ప్రారంభం

లక్ష్మీ బస్సు ప్రారంభం