
నెక్కంటిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు
రాయగడ: రాజ్యసభ మాజీ ఎంపీ, జిల్లా బీజేడీ అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు, అతని అనుచరులు బి.మన్మథరావు(చిట్టి), కృష్ణలపై రాయగడ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు యాల్ల కొండబాబు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. లారీ యజమానుల సంఘం అధ్యక్షుడిగా గత 40 ఏళ్లుగా వ్యవహరించిన నెక్కంటి, అతని అనుచరులు సంఘానికి సంబంధించిన ఆదాయం లెక్కలు చూపించకుండా స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం తాను (కొండబాబు) లారీ యజమానుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరర్వాత ఇప్పటివరకు సంఘం పేరుమీద సుమారు రూ.2 కోట్లు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అయితే నలభై ఏళ్లుగా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన నెక్కంటి కనీసం ఒక్క రూపాయి ఆదాయం సంఘం పేరుమీద ఉన్నట్లు చూపించలేదని వివరించారు. ఇకపై ఆయన ఆగడాలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘానికి సంబంధించిన ఆదాయం లెక్కలను చూపించాలని, లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదుట కొద్దిసేపు నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం కార్యదర్శి కడుపుకూట్ల జానకీరామయ్య తదితరులు పాల్గొన్నారు.

నెక్కంటిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు