
ఆరుతడి వరిసాగు లాభదాయకం
రణస్థలం: మారిన వాతావరణ పరిస్థితులలో తక్కువ నీటితో లాభదాయక దిగుబడులు పొందడం ఆరుతడి వరిసాగు విధానం ద్వారే సాధ్యమని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ మేనేజర్ ఆర్.హరిబాబు అన్నారు. శనివారం రణస్థలం మండలం వెంకటరావుపేటలో యంత్రం ద్వారా విత్తనం, ఎరువు ఒకేసారి వేసే విధానంపై రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాధార భూములు, తక్కువ నీటి వనరులున్న పొలాలకు ఈ విధానం అనుకూలంగా ఉంటుందన్నారు. డ్రమ్ సీడింగ్ యంత్రాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. దీనివల్ల ఎకరాకు 15 నుంచి 16 కేజీల విత్తనం సరిపోతుందన్నారు. నారుమడి పెంపకం, నాట్లు అయ్యే ఖర్చు తగ్గడమే కాక పంట కూడా సుమారు వారం రోజులు ముందే కోతకు వస్తుందని చెప్పారు. వరుస విధానం వల్ల పురుగులు, తెగుళ్ల సమస్య తక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కె.విజయభాస్కర్, ఏఈఓ వై.రాజశేఖర్, వీఏఏ సంధ్య, ప్రాంతీయ మేనేజర్ పి.తవిటినాయుడు, సమన్వయకర్తలు ఎస్.పి.నారాయణరావు, పి.రమణ, గ్రామ వ్యవసాయ సహాయకులు, లీడ్ ఫార్మర్లు కె.రాము తదితరులు పాల్గొన్నారు.