
ఆదిత్యుని సన్నిధిలో భక్తజనం
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకునేందుకు బారులు తీరారు. రావిచెట్టు, ఇంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనాల మార్గాల్లో కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అంతరాలయంలో మూలవిరాట్టుకు ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనాలు జరిగేలా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ చర్యలు చేపట్టారు. పలువురు జిల్లా అధికారులు, న్యాయమూర్తులు కుటుంబాలతో సహా ఆదిత్యున్ని దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ వెంకటరమణ తదితరులు ప్రొటోకాల్ దర్శనాలు చేయించారు.

ఆదిత్యుని సన్నిధిలో భక్తజనం