
ఎయిమ్స్ వెలుపల నిరసనలకు కళ్లెం
భువనేశ్వర్: పూరీ జిల్లా బొలొంగా ప్రాంతపు బాలిక చికిత్స నేపథ్యంలో స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ప్రాంగణంలో రాజకీయ వర్గాల నినాదాలతో మారు మోగుతోంది. శనివారం రాత్రంతా ఇదే పరిస్థితి కొనసాగడంతో రాత్రికి రాత్రి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) 163 సెక్షన్ అమలు చేసినట్లు ప్రకటించారు. ఈ నిబంధన కింద ఎయిమ్స్ భువనేశ్వర్‌లోని బర్న్ వార్డు చుట్టుపక్కల ప్రాంతాన్ని నిషేధిత జోనుగా పరిగణించడం జరుగుతుందని నగర డీసీపీ జగ్మోహన్ మీనా తెలిపారు. పూరీ జిల్లా బొలంగా ప్రాంతంలో జరిగిన దారుణమైన దాడిలో 15 ఏళ్ల కాలిన బాధిత బాలిక తీవ్ర చికిత్స పొందుతున్న ఆస్పత్రి సమీపంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బిజూ జనతా దళ్ కార్యకర్తలు శనివారం రాత్రి ఘర్షణ పడిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. సాయంత్రం రాజకీయ కార్యకర్తలు ఆస్పత్రి వెలుపల నిరసన తెలిపి న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసింది. పోలీసులు లౌడ్ స్పీకర్లతో హెచ్చరికలు జారీ చేసి, అంతరాయం కలగకుండా, ఇన్ఫెక్షన్ ప్రమాదం నివారణకు ఆసుపత్రి ప్రాంగణం నుంచి నిరసనకారులను తొలగించడం ప్రారంభించారు.
శాంతిభద్రతలను కాపాడటానికి 3 ప్లాటూన్ల పోలీసులను మోహరించారు. ఆస్పత్రి ప్రవేశ, లాబీ ప్రాంతాల దగ్గర గుమిగూడకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఎన్‌ఎస్ 163 అమలు అనధికార సమావేశాలను నిషేధిస్తుంది. అధికారులు ఎయిమ్స్ భువనేశ్వర్ ప్రాంగణాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు నిరసనలను నిషేధం అమలు నిరవధికంగా కొనసాగుతుందన్నారు. రాత్రింబవళ్లు నిఘా వేసేందుకు ప్రత్యేకంగా ఒక
ప్లాటూన్ పోలీసులను మోహరించారు. నిరసనల కారణంగా రోగుల సంరక్షణ ప్రభావితమైందని డీసీపీ జగ్మోహన్ మీనా విచారం వ్యక్తం చేశారు.
బొలంగా బాలిక పరిస్థితి విషమం
బొలొంగా బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఉన్నత చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు విమానంలో తరలించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ అశుతోష్ బిశ్వాస్ తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన వైద్య బృందంతో పాటు బాధిత బాలిక కుటుంబ సభ్యులు కూడా వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.20 గంటలకు ఆమెని ఆస్పత్రిలో చేర్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆస్పత్రిలో చేరే సమయానికి బాధితురాలి శరీరం 75 శాతం వరకు కాలిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నందున ఆక్సిజన్ మద్దతుతో ఢిల్లీ ఎయిమ్స్ ఐసియూ బర్న్ యూనిట్, ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్‌లో చికిత్స అందజేస్తున్నారు. ప్రత్యేక వెద్య బృందం ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది.
ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తాం: ముఖ్యమంత్రి
బొలొంగా బాధిత బాలిక చికిత్స కోసం ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. ఉత్తమ చికిత్స కోసం ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు విమానంలో తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. బాలిక కోలుకుని త్వరలో తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఎయిమ్స్ వెలుపల నిరసనలకు కళ్లెం