
బాలికలకు ఆర్థిక సాయం
నరసన్నపేట: దేవాది కాలనీలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలు మోహిని, యోగితలకు కంబకాయ గ్రామానికి చెందిన గుజ్జిడి కృష్ణారావు దంపతులు రూ.25,500 ఆర్థిక సహాయం ఆదివారం అందించారు. బాలికల చదువు, ఇతర ఖర్చులకు వినియోగించాలని బాలికల అమ్మమ్మ సాయమ్మను కోరారు. బాలికలు ఆరు నెలల వ్యవధిలో తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. తల్లి స్వాతి కాన్సర్ వ్యాధితో, తండ్రి కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. బాలికలకు అండగా ఉంటామని వారి చదువుతో పాటు ఇతర అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తామని కృష్ణారావు దంపతులు తెలిపారు. కాగా అలాగే మోహిని, యోగితలకు కోటబొమ్మాళి కేజీబీవీలో సీట్లు వచ్చాయి. ఇప్పటి వరకు మాకివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో చదువుతుండగా కోటబొమ్మాళి కేజీబీవీలో రెండు రోజుల క్రితం జాయిన్ అయ్యారు. గ్రామ పెద్దల కృషి తో వారికి కేజీబీవీలో సీటు వచ్చింది. కార్యక్రమంలో దాతలు సిర్నెల్లి రమణ, బొంగు సునీతలు, స్థానికులు పాల్గొన్నారు.