
ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం
మందస: మండలంలోని కొత్త కమలాపురం, బాలిగాం సమీపంలో పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని రైతులు బొంగి వెంకయ్య, బొంగి సీతారాం, భావన సాంబమూర్తి, సేపాన నారాయణ, కోండియా నారాయణస్వామి తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ దుండగులు రాత్రివేళల్లో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేస్తూ లోపలున్న రాగిని అమ్ముకుంటున్నారని చెప్పారు. విషయాన్ని విద్యుత్ శాఖాధికారి ఎల్.యోగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
పాఠశాల పునర్నిర్మాణం చరిత్రాత్మకం
మందస : మందసలో 125 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రాజా శ్రీనివాస స్మారక ఉన్నత పాఠశాల పునఃప్రారంభ వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ చారిత్రక పాఠశాల భవనం పునఃప్రారంభం కావడం, అందులో భాగస్వామ్యం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. డీఈఓ తిరుమల చైతన్య మాట్లాడుతూ ఆనాటి మహారాజులు నిర్మించిన భవనాన్ని నేటి మా రాజులైన పూర్వ విద్యార్థులు పునర్నిర్మించి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించారని కొనియాడారు. అనంతరం అతిథులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో సుమారు 16 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక జరగనుంది.