
స్మార్ట్ మీటర్లు వద్దు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):
విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దని, ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని కోరుతూ వామపక్ష నాయకులు సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్ సీపీఎం కార్యాలయంలో విద్యు త్ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్త లు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలపై ఆగస్టు 5వ తేదీన విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయాల వద్ద చేప ట్టనున్న ధర్నాలను జయప్రదం చేయాలని కోరా రు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలుగొ ట్టండి అని యువగళం పాదయాత్రలో లోకేష్ పిలు పునిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు ద్వారా ప్రజలను తీవ్రంగా దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చాక మోసం
ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, ఎన్నికలకు ముందు కూటమి నాయకులు కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అత్యధికంగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. అదానీ స్మార్ట్ మీటర్ల ఖర్చులు నిమిత్తం 93 నెలల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తారన్నారు. వాటిని ఇళ్లకు బిగించకుండా ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. దక్షిణాదిలో కేరళ, బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాయని తెలియజేశారు. రాష్ట్రంలో రెండు కోట్ల మీటర్లు పెట్టి రూ.25 వేల కోట్ల భారం ప్రజల మీద వేసేందుకు పూనుకున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమం ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. జూలై 18 నుంచి 22 వరకు పట్టణ, మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రరావు, పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ఎం.గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు.
ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి
వామపక్ష నాయకుల డిమాండ్