
సారా, మద్యాన్ని అరికట్టాలి
జయపురం: సారా, మద్యాన్ని అరికట్టాలని జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి మహుళి గ్రామ పంచాయతీ బిచలకోట గ్రామ ప్రజలు బొయిపరిగుడ పోలీసులకు గురువారం వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రజలు బొయిపరిగుడ అబ్కారీ కార్యాలయానికి వెళ్లారు. అబ్కారీ అధికారి లేక పోవటంతో పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసు అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. మహుళి పంచాయతీ కుంబారగుడ కాలనీగుడ, బెడగుడ, కొలాబ్ నదీ ప్రవాహిత ప్రాంత బాడిజొడి చొటనాళ ప్రాంతంలో నాటు సారా బట్టీలను బంద్ చేయాలని డిమాండ్ చేశారు. కొట్ట జంక్షన్‌లో విదేశీ మద్యం జోరుగా విక్రయిస్తున్నారని, వాటిని అరికట్టాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో నాటు సారా వంటకాలను, అమ్మకాలను అరికట్టేందుకు ప్రతి గ్రామానికి వెళ్లి సభలు, సమావేశాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నామని వెల్లడించారు. సారాకు బానిస కావడం వల్ల యువత భవిష్యత్ అంధకారం అవుతుందన్నాచారు. సారా వలన తక్కువ వయసులోనే మహిళలు వితంతువులు అవుతున్నారని, గ్రామాలలో సారా అమ్మటం వలన అశాంతి, కుటుంబాల్లో కలహాలు ఏర్పడుతున్నాయన్నారు. యువకులు శాంతి భద్రతలకు విఘాతం కల్పించటమే కాకుండా.. హత్యలకు, కొట్లాటలకు కారణమవుతున్నారన్నారు. సారా నుంచి ప్రజలకు ముక్తి కల్పించాలని, ప్రజలను చైతన్యవంతులను చేయాలని, అధికారులు సహకరించాలన్నారు.