
దళిత కుటుంబం ఉసురు తీసిన ప్రేమ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రం సమీపంలో గార మండలం వత్సవలస వద్ద ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ఓ దళిత కుటుంబం ఈ నెల 22న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భర్త యండా మోహనరావు (47) రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి దాటాక మృతిచెందాడు. భార్య రేణుక, కుమార్తె అంజలిలు రిమ్స్ ఐసీయూలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా వారి పరిస్థితీ విషమంగానే ఉంది. తమ లాంటి దళిత పేద కుటుంబం మొత్తం ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం వెనక తమ కుమారుడు విజయవాడకు చెందిన ఓ మైనరు బాలికను ప్రేమించి పరారవ్వడం, బాలిక తరపువాళ్లు విజయవాడ పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, ఉపాధి నిమిత్తం శ్రీకాకుళం నగరం గుజరాతీపేట సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో నివాసముంటున్న తమ వద్దకు పెనమలూరు పోలీసులు శ్రీనివాసరావు, వీరయ్యలు వచ్చి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు పాల్పడటమే కారణమని, అంతే కాకుండా పోలీసులు విజయవాడ తీసుకెళ్లి నానా ఇబ్బందులకు గురిచేసేవారని.. పరారైన కుమారుని జాడ కూడా లేకపోవడంతో ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామంటూ బాధితులు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇవన్నీ మోహనరావు సుమారు 15 నుంచి 18 పేపర్లలో ఎచ్చెర్ల పోలీసులకు రాసిన లేఖలో ఉన్నవే కాక.. భార్య రేణుక మంగళవారం రిమ్స్ ఆసుపత్రి వద్ద విలేకరుల వద్ద తన గోడు వినిపించింది. తమ ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసి ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బ్యాంకు అకౌంట్లు, బైక్ తీసుకెళ్లిపోయారని, మతిస్థిమితం లేని తన కుమార్తెను, తనను ఇకనైనా విడిచిపెట్టాలని వేడుకుంది. యువకున్ని పిలిపిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇరు వర్గాలతో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగించాలనుకున్నామని.. ఈలోగానే ఇలా జరగడం బాధాకరమని ధర్మవరం సర్పంచ్ అల్లు కన్నబాబు, గ్రామస్తులు మీడియాకు చెప్పారు.
థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు:సీఐ
ఈ విషయమై పెనమలూరు సీఐ వెంకటరమణ ‘సాక్షి’తో మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేశామన్నారు. ఈ వ్యవహారమంతా యువకుడి తల్లికి తెలిసినా భర్త మోహనరావుకు చెప్పలేదన్నారు. అబ్బాయి, అమ్మాయిని తెచ్చిస్తే ఎటువంటి కేసు ఉండదని చెప్పామని, లేకుంటే ముద్దాయిలవుతారని చెప్పడంతో భయంతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడివుంటారని పేర్కొన్నారు. పోలీసులు ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని, బాలిక అదృశ్యం కేసు సున్నితాంశం ఇలా చేయాల్సివచ్చిందని స్పష్టం చేశారు.
కేసు నమోదు
గార: వత్సవలస సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ధర్మవరం గ్రామానికి చెందిన ఎండ మోహనరావు(47) రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడని, భార్య రేణుక ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ ఎం.చిరంజీవి తెలిపారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దళిత కుటుంబంలో తండ్రి మృతి
తల్లీ, సోదరి పరిస్థితి విషమం
విచారణ పేరుతో విజయవాడ
పోలీసులు టార్చర్ పెట్టారని ఎచ్చెర్ల
పోలీసులకు లేఖ