
ఫిషింగ్ జెట్టీ కోసం స్థల పరిశీలన
గార: బందరువానిపేట, తోనంగి పరిసరాల్లో ఫిషింగ్ జెట్టీ ఏర్పాటుకు గల అవకాశాలపై అధికారులు మంగళవారం స్థల పరిశీలన చేశారు. తోనంగి రెవెన్యూ పరిధిలో పోర్టుల్యాండ్ భూములుండగా, వీటిలో ఫిషింగ్ జెట్టీ అవకాశాలపై గోవా షిప్పింగ్ లిమిటెడ్ డీజీఎం, కమాండెంట్ ఎం.హరికృష్ణన్, పోర్టు ల్యాండ్ కన్జర్వేటర్ బీఎస్ మూర్తిలు పరిశీలించారు. సర్వేయర్ మెట్ట శ్రీరామమూర్తి, ఆర్‌ఐ డి.రాజేంద్ర, వీఆర్‌వో సుశీల తదితరులు పాల్గొన్నారు.
గిన్నిస్‌బుక్‌లోకి శామ్యూల్
పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ రామమందిరం వీధికి చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు విక్టర్ శామ్యూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. విజయవాడకు చెందిన హలెల్ మ్యూజిక్ స్కూల్ తరఫున పాస్టర్ ఆగస్టిన్ దండింగి ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన 18 దేశాలకు చెందిన 1090 మంది ఒకేసారి ఆన్‌లైన్ వేదికగా గంట వ్యవధిలో కీబోర్డ్ ప్లే చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు గుర్తించి 1046 మందికి బుక్‌లో స్థానం కల్పించారు. అందులో శామ్యూల్ ఒకరు. ఇటీవల విజయవాడలోని గుణదలలో జరిగిన కార్యక్రమంలో శామ్యూల్‌కు ధ్రువీకరణపత్రం ప్రదానం చేశారు.
ఆదిత్యుని హుండీ కానుకల ఆదాయం రూ.81.84 లక్షలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల ద్వారా రూ.81,84,890 ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనివెట్టి మండపంలో నిర్వహించిన లెక్కింపు ప్రక్రియలో నగదు రూపంలో రూ.77,21,606, చిల్లర రూపంలో రూ.4,63,284 వరకు ఆదాయం లభించిందని వివరించారు. అలాగే 81 గ్రాముల 27 మిల్లీ గ్రాముల బంగారం, 3 కిలోల 810 గ్రాముల వెండి వస్తువులు కూడా మొక్కులు, కానుకల రూపంలో హుండీల్లో లభించినట్లుగా తెలియజేశారు. వీటితో పాటు విదేశీ నగదు కూడా లభించింది. లెక్కింపునకు పర్యవేక్షకునిగా జిల్లా ఏసీ ప్రసాద్‌పట్నాయక్, ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీహరిసేవా సమితి, శ్రీసత్యసాయి సేవా సమితి శ్రీవారి సేవా సమితి ప్రతినిధులు ఈ లెక్కింపులో స్వచ్ఛందంగా పాల్గొని నగదును చిల్లరను లెక్కించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కవిటి : మండలంలోని కొజ్జీరియా జంక్షన్‌లో 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ మంగళవారం తెలిపారు. సీహెచ్ బలరాంపురం వైపు నుంచి జాతీయ రహదారిపై నడిచివస్తుండగా ట్రాలీ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పా రు. తెలుగు షర్టు, నలుపు ఫ్యాంటు ధరించిన ఈ వ్యక్తి వివరాలు తెలిసిన వారు 6309990870 నంబరుకు సంప్రదించాలని కోరారు.
అదుపు తప్పిన ఆటో
● ఇద్దరికి గాయాలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని గూనపాలెం డీఎస్పీ కార్యాలయం సమీపంలో సెంటర్ డివైడర్ స్తంభాన్ని ఆటో ఢీకొట్టింది. ఆ సమయంలో వెనుకగా వస్తున్న ద్విచక్రవాహనాలు అదే ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గార మండల కేంద్రానికి చెందిన లక్ష్మణరావు తన ఆటోలో కళింగపట్నానికి చెందిన దీర్ఘాసి రత్న, కృష్ణవేణి, దీర్ఘాసి నరసమ్మ, శాలిహుండంకు చెందిన తోట రాజులమ్మ, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కళింగపట్నం నుంచి పాతబస్టాండ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ లక్ష్మణరావు తలకు గాయమవ్వగా, రాజులమ్మ చేతికి గాయమైంది. ఈ ఘటనలో రూ.5 వేలు నగదున్న పర్సు, సెల్‌ఫోన్ పోయిందని రాజులమ్మ తెలిపారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ద్విచక్ర వాహనదారులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ట్రాఫిక్ సీఐ నాగరాజు పేర్కొన్నారు.

ఫిషింగ్ జెట్టీ కోసం స్థల పరిశీలన

ఫిషింగ్ జెట్టీ కోసం స్థల పరిశీలన