ఘనంగా సిద్ధాంత సాహితీ సంస్థ రజతోత్సవం
పర్లాకిమిడి: సిద్ధాంత సాహితీ సంస్థ రజతోత్సవ వేడుకలు రాజవీధిలో విశ్వనాథ్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, విశిష్ట అతిథిగా మాజీ వైస్ చాన్సలరు ప్రొఫెసర్ డాక్టర్ మన్మనాథ్ పాడీ, గౌరత అతిథిగా గుణుపురం సబ్ కలెక్టర్ కిరణ్‌దీప్ కౌర్ సహిత, బరంపురం విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరక్టర్ డాక్టర్ సిద్ధార్థ శంకర్ పాడీ, పూర్ణచంద్ర మహాపాత్రో తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా సిద్ధాంత వార్షిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పత్రికకు ఎడిటర్‌గా మహిళా కళాశాల ప్రొఫెసర్ కల్యాణీ మిశ్రా పత్రిక విశేషాల గురించి వివరించారు. సవరసామాజ్ రంగంలో విశేషంగా కృషిచేసిన రచియిత కవిసూర్యనగర్‌కు చెందిన డాక్టర్ సురేంద్రనాథ్ సాహును కలెక్టర్ సన్మానించారు. అనంతరం ‘సిద్ధాంత’ ప్రతిభా పురస్కారాలు రాయఘడ బ్లాక్ సర్పంచ్ (జలంగ్) లాబణ్య శోబర, తరిణీసేన్ దాస్ (చాందిపుట్), గుణుపురానికి చెందిన కృష్ణ శబర, ఫాల్గుణీ శోబోరో (గుణుపురం), గాయత్రీ శోబోరో (మరిచగుడ, పద్మపూర్ బ్లాక్), హారాబతీ గోమాంగో (పద్మపూర్), అమ్రిత్ పాణిగ్రాహి (పర్లాకిమిడి)లను సత్కరించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో డి.ప్రియాంక, వి.హిమగిరి ఆధ్వర్యంలో ఒడిస్సీ, కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సంస్కృత విద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ అన్నపూర్ణాదేవి అధ్యక్షత వహించారు.


