పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
కొరాపుట్: మీనాక్షి హైడ్రో పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా గిరిజనులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి రామగిరి, దండాబడి గ్రామ పంచాయతీలకు చెందిన 19 గ్రామాల గిరిజనులు దండకారణ్యం పుజారి పుట్‌లో ఆదివారం సమావేశమయ్యారు. ఈ ప్లాంట్ యాజమాన్యం మొదటి ప్లాంట్ నిర్మాణం తర్వాత నిబంధనలు ఉల్లఘించిందన్నారు. మీకాక్షి పవర్ ప్లాంట్ రెండు, మూడు ప్లాంట్‌ల నిర్మాణంలో ప్రభుత్వ అనుమతులు లేవన్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే బదలిపొడ, అటల్‌గుడ, కుంబికారి, మాలిపొదర్ గ్రామాలు తీవ్రంగా నష్ట పోతాయన్నారు. హైదరాబాద్‌కి చెందిన మీనాక్షి సంస్థ తెంతులిగుమ్మ వద్ద 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శబరి నది నీటిని వీనియోగిస్తుంది. తర్వాత రెండో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకొని మూడవ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వెళ్తుంది. సారంగపల్లి వద్ద విద్యుత్ వైర్ల కోసం రాళ్లును పేల్చి అనేక చెట్లు నరికేశారు. ఇవేవి స్థానిక గ్రామాల ప్రజలకు తెలియదన్నారు. ఇటువంటి పనులకు గ్రామ సభ అనుమతి తప్పనిసరి ఉండాలన్నారు. మరోవైపు నిర్మాణం పూర్తయితే తమ గ్రామాలు మునిగిపోతాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కొరాపుట్ జిల్లా కలెక్టర్, జయపూర్ సబ్ కలెక్టర్‌లకు ఫిర్యాదు చేశారు. తమ గోడును పాలకులు 10 రోజుల్లో వినకపోతే ప్లాంట్ లోపలకి దూసుకువెళ్తామని గిరిజనులు తీర్మానించారు.


