
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నిర్వహించినట్లు శ్రీకాకుళం స్టేషన్ సీఐ ఎం.వి.గోపాలకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిటర్న్ అధికారిగా తనతో పాటు నరసన్నపేట సీఐ ఎస్.వి.రమణమూర్తి వ్యవహరించినట్లు తెలిపారు. అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు.
ఆదిత్యాలయానికి భక్తుల తాకిడి
అరసవల్లి : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. ప్రత్యేక ఆదివారంతో పాటు వత్సవలస రాజమ్మతల్లి ఉత్సవాల కొనసాగింపు సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కొందరు సూర్యనమస్కారాల పూజలు చేయించుకోగా...మరికొందరు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లుతో పెద్దగా ఉపశమనం కలుగకపోవడంతో భక్తులు విమర్శలకు దిగారు. వీఐపీల పేరిట చాలా మంది ఫేక్ వీఐపీలు దర్శనాలకు వెళ్లడంపై క్యూలైన్లలో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.3,76,300, విరాళాల రూపంలో రూ.1,41,803, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.75 లక్షల వరకు ఆదాయం లభించిందని ఆలయ ఈవో వై.భద్రాజీ వెల్లడించారు.
సీఆర్‌పీఎఫ్ జిల్లా సలహాదారుడిగా చందనరావు
శ్రీకాకుళం న్యూకాలనీ: బాలల హక్కుల వేదిక పరిరక్షణ వేదిక(సీఆర్‌పీఎఫ్) జిల్లా సలహాదారుడిగా తమ్మినేని చందనరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జాతీయ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి నియామక పత్రం అందజేశారు. చందనరావు సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి జిల్లా కమిటీ చొరవతో చిత్తశుద్ధితో సేవలు అందిస్తానని తమ్మినేని పేర్కొన్నారు. ఈయన నియామకం పట్ల సీఆర్‌పీఎఫ్ రాష్ట్ర ఇన్‌చార్జి డి.ప్రకాష్, రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ అరుణ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి ఆమదాలవలస గేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్ మండలం నైర పంచాయతీ చల్లపేటకు చెందిన కరిమెళ్ల సూరిబాబు(55) ఆమదాలవలస గేటు ప్రాంతంలో వడ్రంగి దుకాణంలో పనిచేస్తున్నాడు. కుటుంబం లేకపోవడంతో అక్కడే ఉంటున్నాడు. ట్రాక్ దాటేందుకు వచ్చాడో, ఇంకేం జరిగిందో తెలియదు గానీ ఆదివారం పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు శవ పంచనామా కోసం తరలించారు.
రైలు ఢీకొని యువకుడు మృతి
పొందూరు: పొందూరు రైల్వేగేటు సమీపంలో ఆదివారం అమరావతి రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు ఆమదాలవలస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు. సుమారు 30 ఏళ్ల గల ఈ యువకుడు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. యువకుడు ఎరుపు టీషర్టు, నీలం ప్యాంట్ ధరించాడని, ముఖం గుర్గు పట్టలేని విధంగా మారిందని చెప్పారు. వివరాల కోసం 9493474582 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
శ్రీకూర్మంలో భక్తజన సందోహం
గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సాధా రణ భక్తులతో పాటు చిన వత్సవలస రాజమ్మ తల్లి సంబరాల నుంచి తిరుగుపయనమైన వారు కూడా క్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దర్శనాల క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. ఆలయ ఇన్‌చార్జి ఈవో జి.గురునాథం పర్యవేక్షించారు. మరోవైపు సరైన పార్కింగ్ స్థలం లేక వాహనదారులకు ఎప్పటిలాగే ఈ వారం కూడా ఇబ్బందులు తప్పలేదు. కారు, ఆటో, బైక్‌లు పెట్టేందుకు స్థలం చూపించకపోయినా ఆశీలు మాత్రం పంచాయతీ పేరిట వసూలు చేస్తుండటంపై పలువురు వాహనచోదకులు అసహనం వ్యక్తం చేశారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక