పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఎన్‌టీఆర్ హౌసింగ్ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, అర్బన్ ప్రాంతంలో రెండున్నర సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు కేటాయించనుంది. హౌసింగ్‌లో వచ్చే నిధులను ఒక్కో లబ్ధిదారుకు రూ.2.50లక్షలకు పెంచినట్లు పక్క ప్రభుత్వం, మరోపక్క అధికారులు చెబుతున్నారు. వాటికి తోడు బీసీ, ఎస్సీ కులాల లబ్ధిదారులకు అదనంగా రూ.50వేలు, ఎస్టీ కులాలకు చెందిన లబ్ధిదారులకు అదనంగా రూ.70వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ క్రమంలో హౌసింగ్ పథకం అమలు వేగం పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతా ఒక ఎత్తయితే హౌసింగ్ పథకంలో బీసీ, ఎస్సీ,ఎస్టీ కులాల ధ్రువీకరణ పత్రాలు, వారి అనుభవంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ అధికారులతో పొజిషన్ సర్టిఫికెట్లు జతచేయాలన్న నిబంధన పెట్టారు. దీంతో లబ్ధిదారులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు స్థలాల పొజిషన్ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో లబ్ధిదారులకు ఇబ్బందులు రావడం లేదు కానీ పొజిషన్ సర్టిఫికెట్ మంజూరులో రెవెన్యూ అధికారులు పలు ప్రశ్నలు వేస్తున్నారు. స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్లు ఉండాలని, డీకేటీ, గ్రామకంఠం భూములకు ఇవ్వమని చెబుతున్నారు. గ్రామాల్లో పేద రైతులకు వారి పొలాల వద్ద హౌసింగ్ ఇంటి నిర్మాణానికి స్థలాలు ఉన్న భూములకు వన్‌బీ ఉండడంతో మూడు సెంట్ల స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తామని రెవెన్యూ అధికారులు మెలిక పెడుతున్నారు. దీంతో లబ్ధిదారులు తమ గోడు ఎవరికీ చెప్పుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గందరగోళంలో హౌసింగ్ అధికారులు
పార్వతీపురం మన్యం జిల్లాలో హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి. ప్రతి వారం రోజులకు ఈ పథకంలో సాధించిన నివేదికలు ఇవ్వండి అంటూ హౌసింగ్ ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారుల వెంట పడుతున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే ఈ పాటికే హౌసింగ్ నిర్మాణాలు పునాదులు దాటి గోడస్థాయికి వచ్చి ఉండేవి. కానీ లబ్ధిదారుల సొంత స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ ఉంటేనే నిధులు మంజూరు చేయాలనే నిబంధన ఉండడంతో ఇక్కడే ఈ పథకం ముందుకు కదలకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. దీంతో ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక, రెవెన్యూ అధికారులను ప్రాథేయపడలేక హౌసింగ్ అధికారుల్లో గందరగోళం నెలకొంది.
జిల్లాలో 18,056 మంది లబ్ధిదారుల గుర్తింపు
పార్వతీపురం మన్యం జిల్లాలో 18,056 మంది హౌసింగ్ పథకంలో లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు సర్వే చేశారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు హౌసింగ్ పథకంలో ఇంటి నిర్మాణం మంజూరు చేసేందకు ఆ స్థలాల్లో పొజిషన్ సర్టిఫికెట్ల మెలిక పెట్టడంతో అవి నిలిచిపోతున్నాయి. జిల్లాలో గల 15 మండలాల్లో అధికారులు విస్తృతంగా సర్వే నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. సుమారు 13వేల మందికి పైగా లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు లేవన్న కారణంగా హౌసింగ్ బిల్లులు అందుతాయో? లేదోనన్న ఆందోళన నెలకొంది.
హౌసింగ్ నిధులు ఒక్కో లబ్ధిదారుకు రూ.2.50లక్షలకు పెంపు
కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్ తప్పనిసరి
తలలు పట్టుకుంటున్న ఇళ్ల లబ్ధిదారులు
అన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
హౌసింగ్ పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. సొంత స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. ఆధాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తేనే లబ్ధిదారులకు హౌసింగ్ నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టేలా చూస్తున్నాం.
– పి.ధర్మ చంద్రారెడ్డి, ఇన్‌చార్జ్ హౌసింగ్ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా