విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోందని విశాఖ రేంజ్ పోలీసు డీఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేశారు. ఈ మేరకు గడిచిన ఎనిమిది నెలల్లో మూడు దశల్లో పట్టుబడిన 7 వేల 378 కేజీల గంజాయిని ధ్వంసం చేశామని డీఐజీ తెలిపారు. విశాఖ పోలీస్ రేంజ్ పరిధి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాత కుంకాంలో గురువారం మూడు జిల్లాల్లో పలు కేసుల్లో సీజ్ చేసిన గంజాయి నిర్మూలన కార్యక్రమం జరిగింది. 226 కేసులలో సీజ్ చేసిన 7378 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, ,శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి