పర్లాకిమిడి: ఏప్రిల్ 1 ఉత్కళ దివాస్, 26న పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో బుధవారం సాయంత్రం జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పాఠశాలల హెచ్‌ఎంలు, ఉత్కళ సమాజ్, తదతర సంస్థల ప్రతినిధులతో ముందస్తు సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సబ్ కలెక్టర్ అనుప్ పండా, సి.డి.ఎం.ఓ డాక్టర్ మహామ్మద్ ముబారక్ అలీ, సమగ్ర గిరిజినాభివృద్ధి శాఖ అధికారి అంశుమాన్ మహాపాత్రో, జిల్లా సాంస్కృతిక అధికారి అర్చనా మంగరాజ్, డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, డి.పి.ఆర్.ఓ ప్రదీప్ కుమార్, ఇతర శిక్షా అనుష్టాన్, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఏప్రిల్ 26న మహారాజా కృష్ణచంద్ర గజపతి శ్మశాన వాటిక వద్ద పుష్పాంజలి, వివిధ కూడళ్లల్లో ఆయన విగ్రహాలకు నివాళులర్పించాలన్నారు. విద్యార్థులకు ఉత్కళ దివాస్ సందర్భంగా వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. టౌనుహాల్‌లో ఒడిశా వంటకాల పోటీలు నిర్వహించాలని పలువురు కోరారు.