● ఘనంగా ముగిసిన డెప్పిగూడ అగ్ని గంగమ్మ ఘటోత్సవం ● తరలివచ్చిన భక్తజనం
జయపురం: జయపురం డెప్పిగూడ అగ్ని గంగమ్మ తల్లి ఘటోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజున అమ్మవారి దర్శనానికి భక్తులు ఉత్సాహంగా తరలివచ్చారు. ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ఘటోత్సవాలు మున్నెన్నడూ లేనంత ఆడంబరంగా.. అంగరంగ వైభవంగా జరిగాయి. ఐదు దశాబ్దాల కిందట గులాబ్ అనే భక్తుడు డెప్పిగూడ పైగల చిన్న కొండపై పూరిపాకలో అమ్మవారిని ప్రతిష్టించాడు. ఆ నాటి నుంచి క్రమం తప్పకుండా అతడి సంతతి వారు స్థానికుల సహకారంతో ఏటా అగ్ని గంగమ్మ తల్లి ఘటోత్సవాలు జరుపుతున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు గ్రామం నాగేంద్ర ఈవెంట్స్ వారి ప్రత్యేక పౌరాణిక వేషాల ప్రదర్శనలు ప్రజలను అలరించాయి. చివరి రోజైన బుధవారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో వందలాదిమంది మహిళలు, పురుషులు, బాల బాలికలు ఘటాలతో డెప్పిగూడ ప్రధాన పూజా మందిరం నుంచిబయలు దేరి 26వ జాతీయ రహదారి శ్మశాన రోడ్డు కూడలి వద్ద గల అగ్ని గంగమ్మ తల్లి గుడికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి భక్తులు గొర్రెలు, మేకలు, కోళ్లు బలి ఇచ్చి రక్త తర్పణం చేసి మొక్కులు తీర్చుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి ఫలపుష్పాలతో పూజలు చేశారు. అగ్ని గంగమ్మ తల్లిని పూజించి ఏమి కోరుకుంటే అది నేరవేర్చుతుందన్న ప్రగాఢ నమ్మకం ప్రజలలో ఉండడంతో అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని పూజించేందుకు తరలివచ్చారు. డెప్పిగూడ అగ్ని గంగమ్మ పూజాకమిటీ పర్యవేక్షణలో ఉత్సవం వైభవంగా ముగిసింది.
ఉత్సాహం ఉత్సవమై..
ఉత్సాహం ఉత్సవమై..