విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ఐఎస్‌డబ్ల్యూ, హెచ్‌ఎఫ్‌ఏసీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె. ఆరిఫ్ హఫీజ్, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడుతో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. రాష్ట్రపతి రాక, తిరుగు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయంలో రిసెప్షన్, వీడ్కోలు కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ఏఎస్పీలు వీవీ నాయుడు, బి. సత్యనారాయణ, ఇంటెలిజెన్స్ డీఎస్పీ చప్పిడి రాజా, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంతరెడ్డి, సీఎస్‌ఓ కే. ధర్మేంద్ర, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
14న దుర్గగుడికి రాష్ట్రపతి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము 14వ తేదీ ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిగింది. అనంతరం మహామండపం నాలుగో అంతస్తులోని సమావేశ మందిరంలో దేవస్థాన ఈవో, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, సమాచార శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ బాలాజీ


