వైద్యుల నిర్లక్ష్యమే కారణమని రోగి బంధువుల ఆరోపణ దాదాపు 5 గంటల పాటు మృతదేహంతో నిరసన
లబ్బీపేట(విజయవాడ తూర్పు): వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో ఒక నిండు ప్రాణం బలైందని మృతి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో చేరి ఐదు రోజులైనా మరణించే వరకూ జబ్బు ఏమిటనేది చెప్పలేదని మండి పడుతున్నారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారని, వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అసలేం జరిగిందంటే...
కంకిపాడు మండలం పునాదిపాడుకు చెందిన డేరంగుల నాగరాజు (42) రోడ్డు రోలర్ డ్రైవర్‌గా పని చేస్తుంటారు. కొంతకాలంగా నీరసంగా ఉండటంతో 20 రోజుల కిందట జీజీహెచ్‌కి వచ్చారు. వైద్యులు అడ్మిట్ చేసి ఒక యూనిట్ రక్తం ఎక్కించారు. వారం రోజుల చికిత్స తర్వాత కొద్దిగా కోలుకోవడంతో డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు. మరలా నీరసంగా అనిపించడంతో ఐదు రోజుల కిందట మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు కూడా రక్తం తగ్గిందని చెప్పి, మళ్లీ రక్తం ఎక్కించారని బంధువులు చెపుతున్నారు. కాగా మంగళవారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని చెప్పినా ఒక్కరు కూడా పట్టించుకోలేదని, దీంతో సుమారు గంటపాటు కొట్టుకుంటూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రాణాలు విడిచాడని తెలిపారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తమ కుమారుడి ప్రాణాలు పోయేవి కాదంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
వార్డు వద్ద బంధువుల ఆందోళన..
నాగరాజు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు వార్డు వద్ద ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తీసుకెళ్లకుండా సాయంత్రం 6 గంటల వరకూ అక్కడే ఉంచారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుని బంధువులు ఫిర్యాదు చేస్తే, విచారించి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ హామీ ఇవ్వడంతో, ఫిర్యాదు లేఖ ఇచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగం సాధించాలంటే కేవలం చదువు ఒక్కటే చాలదని, స్కిల్ కమ్యూనికేషన్స్ పెంపొందించుకోవల్సిన అవసరం ఉందని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కూన రాంజీ అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన నలంద డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందేందుకు కావాల్సిన స్కిల్స్ కోసం కృష్ణా యూనివర్శిటీ ఎప్పటికప్పుడు కొత్త కోర్సును ప్రారంభించడంతోపాటు వర్శిటీ అనుబంధ కళాశాలల్లో కూడా ప్రారంభించే విధంగా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో విజయవాడ నలంద డిగ్రీ కాలేజి ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. నలంద విద్యా సంస్థల చైర్మన్ ఎ.విజయబాబు మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కోర్సులను మార్పు చేసుకుంటూ విద్యార్థి సమగ్ర వ్యక్తిత్వ వికాసం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనురాధ మాట్లాడుతూ తమ కాలేజి ఫలితాల్లోను, ఉపాధి అవకాశాలు కల్పించడంలో అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఈ సందర్భంగా అకడమిక్ టాపర్స్‌కు జ్ఞాపిక, ప్రశంసా పత్రం బహూకరించారు.


