గన్నవరం: ఏషియన్ గేమ్స్‌లో ఆర్చరీ విభాగంలో పతకాలు సాధించిన బొమ్మదేవర ధీరజ్, టి. గణేష్‌మణిరత్నంలకు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇద్దరు క్రీడాకారులు జపాన్ నుంచి న్యూఢిల్లీ మీదుగా ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. ఏషియన్ గేమ్స్‌లో రికర్వ్ మిక్స్‌డ్ విభాగం, రికర్వ్ టీమ్ విభాగంలో ధీరజ్ సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. ఈ పోటీల్లో గణేష్ మణిరత్నం కాంపౌండ్ టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్, వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించారు. విమానాశ్రయంలో ఇద్దరు క్రీడాకారులకు చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ ప్రధాన కోచ్ చెరుకూరి సత్యనారాయణ, పలువురు క్రీడాభిమానులు, శాప్ అధికారులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. వారిని మంత్రి కొసులు పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు.
నందివాడ: గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మండలంలోని జనార్దనపురంలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. రుద్రపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య మందిర్ ద్వారా జనార్దన పురం, పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందనున్నాయి. ఇదే వేదిక నుంచి రాష్ట్రవ్యాప్తంగా 267 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లను మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో గుడివాడ, గన్నవరం, పెడన ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు భద్రత, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా చేసుకుని త్రిశూల్ వ్యూహంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖనబాబు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలాలోని అన్ని డిజిటల్ బోర్డులు, సినిమా థియేటర్లలో త్రిశూల్ వ్యూహంపై ప్రత్యేక వీడియోలను ప్రదర్శిస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు. నిఘా కోసం అడ్వాన్స్‌డ్ డ్రోన్లు, అధునాతన ప్రచార వాహనాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు తమ సిబ్బందితో కలిసి ముఖ్యమైన ప్రదేశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలకు త్రిశూల్ వ్యూహం ప్రధాన లక్ష్యాలైన రోడ్డు భద్రత, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన (డ్రగ్ ఫ్రీ సొసైటీ) తదితర అంశాలపై సుదీర్ఘమైన అవగాహన కల్పిస్తామని వివరించారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వేలోని పలు సెక్షన్లలో జరుగుతున్న రైళ్ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగా రద్దు కాగా, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ఒక ప్రకటలో తెలిపారు. హతియా – ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు (12835) ఈ నెల 13న, బెంగళూరు – హతియా (12836) రైలు ఈ నెల 15న పూర్తిగా రద్దు చేశారు. ఈ నెల 12న షాలీమార్ – చర్లపల్లి (18045) 1.40 గంటలు, తిరువనంతపూరం – న్యూ ఢీల్లీ (12625) రైలు 1.15 గంటలు ఆలస్యంగా నడవనున్నట్లు పీఆర్‌ఓ తెలిపారు.


