చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు తాడేపల్లికి చెందిన మెండెం నాగరాజు ఆటో డ్రైవర్. అతనికి ముగ్గురు కుమారులు. వారిలో చిన్నవారిద్దరూ కవలలు. పెద్ద కుమారుడు ఓ ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తుండగా, కవలలు శాంతి స్వరూప్ (18), క్రాంతి స్వరూప్‌లు మైలవరంలోని కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా వారిద్దరు వైఎస్సార్ కాలనీలోని పూజల నాగజ్యోతి ఇంట్లో ఉంటున్నారు. సోమవారం రాత్రి కవలల్లో చిన్నవాడు క్రాంతి స్వరూప్ తండ్రికి ఫోన్ చేసి అన్నయ్యకు కరెంటు షాక్ తగిలిందని చెప్పాడు. దీంతో హుటాహుటిన కాలనీకి వెళ్లి చూసే సరికి శాంతి స్వరూప్ చలనం లేకుండా పడి ఉన్నాడు. 108 సిబ్బంది వచ్చి శాంతి స్వరూప్‌ను పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పెనమలూరు: ఉరేసుకొని యువకుడు మృతి చెందిన ఘటనపై కానూరు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ మండలం బొమ్మలూరుకు చెందిన కిలారు రామ్‌కుమార్(28) రెండేళ్లుగా విజయవాడలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కానూరు కల్పనానగర్ ప్రభాకరరావు వీధిలో గ్రూప్‌హౌస్‌లో ఉంటున్నాడు. సోమవారం మిత్రుడు కొడెబోయిన సాయిప్రీతమ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో రాత్రి రామ్‌కుమార్ ఉంటున్న ఇంటికి వచ్చాడు. అతను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉండటం చూసి, వెంటనే తండ్రి ఈశ్వరరావుకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలం వద్దకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుణదల(విజయవాడ తూర్పు): విదేశాలలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి దగా చేసి వ్యవహారంపై బాధితులు మాచవరం పోలీసులను ఆశ్రయించిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగల్రాజపురం ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ మేనేజ్ మెంట్ విద్యా సంస్థలో పలువురు విద్యార్థులు గత యేడాది కోర్సు పూర్తి చేశారు. ఆ సంస్థలో ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ ఇన్చార్జిగా పని చేస్తున్న దాసరి నరేష్ కుమార్ తాను విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థులకు నమ్మబలికాడు. ఈ క్రమంలో ఏడుగురు నిరుద్యోగుల నుంచి రూ.43,11,000 వసూలు చేశాడు. ఫేక్ పత్రాలు, టికెట్లు తయారు చేసి విదేశాలలో ప్లేస్ మెంట్స్ సిద్ధంగా ఉన్నాయంటూ కాలయాపన చేస్తున్నాడు. యేడాది కాలం పాటు ఎదురు చూసిన బాధితులు గత నెల 25వ తేదీన పోలీస్ కమిషనర్‌కు పిర్యాదు చేశారు. అప్పటి నుంచి సదరు నిందితుడు బాధితులకు ఏ విధంగానూ స్పందించడం లేదు. తాను డబ్బులు తీసుకోలేదని ప్లేటు పిరాయించాడు. కాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని ముందే తెలిసిన నరేష్ కుమార్ చైన్నెలో ఉన్న రవి వర్మ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయించాడు. రవి వర్మకు బాధితులు ఫోన్ చేస్తే తనకు సంబంధం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ డబ్బు ఇవ్వమని బెదిరించసాగాడు. దీంతో బాధితులు మాచవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని దోపిడీ గురించి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా బాధితుల్లో ఒకరైన కె.జగదీష్ మాట్లాడుతూ, తాము ఆర్ధికంగా చితికిపోయి ఉన్నామన్నారు. ఈ ఘటన వలన తమ సన్నిహితలలో ఒకరి తండ్రి మృతి చెందారని, మరో వ్యక్తి పక్షవాతానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఎంపిక కావాలని డీఈవో కార్యాలయం ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్ రాంబాబు అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు శ్రీధర్స్ సీసీఈ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు స్టడీ మెటిరియల్‌ను అందించారు. శ్రీధర్స్ సీసీఈ డైరెక్టర్ కొమ్మూరు శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. పరీక్షలో కీలకమైన మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కోసం తమ సంస్థలో విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు. డీవైఈవో సాంబశివరావు, డీసీఈఈ కార్యదర్శి ఉమర్‌అలీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన స్టడీ మెటీరియల్‌తో పాటు సరైన మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఎన్‌ఎంఎంఎస్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


