ఏకోపాధ్యాయ పాఠశాలలు సమస్యలతో సతమతం ఏదైనా కారణంతో టీచర్ సెలవు పెడితే బడికి సెలవే.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేద విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం చంద్రబాబు, లోకేశ్ తీరుపై తల్లిదండ్రులు, విద్యావేత్తల ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. జిల్లాలో ఏకోపా ధ్యాయ పాఠశాలలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం పేద విద్యార్థుల బంగారు భవిష్యత్‌పై దుష్ప్రభావం చూపుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కళకళలాడాయి. మనబడి నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు ఆధునికతను సంతరించకున్నాయి. ఇంగ్లిష్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, గ్రీన్ చాక్ బోర్డులు, కూర్చునేందుకు టేబుళ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్ బల్బులు, మంచినీటి సరఫరాకు ఆర్వో ప్లాంట్‌లు, నీటి వసతితో కూడి మరుగుదొడ్లు, చుట్టూ ప్రహరీలు వంటి వసతులతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నిలిచాయి. విద్యార్థులకు షూ, టై, బెల్టు, బ్యాగ్, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను ఉచి తంగా అందజేశారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అమ్మఒడి పథకం అమలుచేశారు. 8వ తరగతి నుంచే ట్యాబ్‌లు ఇచ్చి సాంకేతిక విద్యను పేద విద్యార్థుల చెంతకు చేర్చారు. ఫలితంగా డ్రాప్‌ఔట్లు తగ్గి, పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
426 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ, మునిసిపల్ యాజమాన్యాల్లో మొత్తం 930 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 87,249 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 5,041 మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉండగా, మరో 426 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్లు సెలవు పెడితే క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు (సీఆర్పీ) డ్యూటీలు వేస్తున్నారు. వారు కూడా సెలవులో ఉన్నప్పుడు ఆ రోజు ఆయా స్కూళ్లకు అనధికారికంగా సెలవు ఇవ్వక తప్పని పరిస్థితి.


