విజయవాడరూరల్: మండలంలోని కొత్తూరు తాడేపల్లి పరిధిలో ఉన్న అస్సైన్డ్ భూముల నుంచి గ్రావెల్ రవాణా చేసే లారీ విద్యుత్ తీగెలు తగిలి బుధవారం దగ్ధమైంది. కొత్తూరు క్వారీ నుంచి తాడేపల్లి మెయిన్ రోడ్డులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మార్ బాక్స్ వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగెలు లారీకి తగిలాయి. విద్యుత్ షార్క్ సర్క్యూటై మంటలు ఎగసిపడ్డాయి. డీజిల్ ట్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో లారీ దగ్ధమైంది. దాదాపు గంట సమయం మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమాచారం అందుకున్న కొత్తపేట అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జి అధికారి ఎండీ సలావుల్లా సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ పరారయ్యాడని స్థానికులు తెలిపారు. లారీలో దాదాపు 40 టన్నుల గ్రావెల్ లోడు ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన లారీ టీడీపీ ప్రజాప్రతినిధి అనుచరుడిదని, అతనికి సంబంధించిన లారీలే అస్సైన్డ్ భూముల్లో గ్రావెల్‌ను రవాణా చేస్తున్నాయని వివరించారు.


