పటమట(విజయవాడతూర్పు): అక్రమ లే అవుట్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్టణ ప్రణాళిక విభాగం ఉద్యోగులు ఇద్దని సస్పెండ్ చేస్తూ నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలోని సర్వే నంబర్ 37, 78ఏ/ఏలోని 3.5 ఎకరాల స్థలంలో అక్రమ లే అవుట్ వ్యవహారంలో వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు అవినీతికి పాల్పడ్డారు. దీనిపై ఈ నెల తొమ్మిదో తేదీన ‘ఆయన చెబితే అంతా సక్రమమే’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ కథ నంపై స్పందించిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏసీపీ – 2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వై.రాంబాబు, స్థానిక టీపీఓ షేక్ రిజ్వానాను బాధ్యులుగా గుర్తించి వారిని సస్పెండ్ చేస్తూ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏసీపీపై మరో ఆరోపణ
ఇటీవల ఏలూరు కాలువ గట్టుపై లెనిన్ సెంటర్ లోని పలు దుకాణాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని విద్యుత్ శాఖ డీఈకి నగరపాలక సంస్థ కమిషనర్ అప్రూవల్ లేకుండా వీఎంసీ సర్కిల్–2 ఏసీపీ వై.రాంబాబు లేఖ రాశారు. ఈ వ్యవహారం తెలుసుకున్న కమిషనర్ ధ్యానచంద్ర అతడిపై చర్యలు తీసుకోవాలని డీటీసీపీని ఆదేశించారు. ఏసీపీ రాంబా బును ఈ ఆరోపణలో కూడా సస్పెండ్ చేస్తున్నట్లు డైరెక్టర్ విద్యుల్లత తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పథకం ప్రకారమే క్రైస్తవులపై దాడులు
ఏపీ క్రిస్టియన్ సొసైటీ ప్రతినిధి పాస్టర్ అరుల్ అరసు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వమే వ్యూహాత్మకంగా అధికారుల ద్వారా చర్చిలను కూలగొడుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ క్రిస్టియన్ సొసైటీ ప్రతినిధి, పాస్టర్ అరుల్ అరసు ఆరోపించారు. ప్రెస్ క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం 15 రోజుల వ్యవధిలోనే రెండు చర్చిలను సీజ్ చేశారన్నారు. పోలవరం, పాతపాడు గ్రామాల్లో రెండు చర్చిలను కూల్చివేశారన్నారు. వీటిని చూస్తే పథకం ప్రకారమే కూల్చివేతలు జరుగుతున్నాయని భావించాల్సి వస్తోందన్నారు. పాస్టర జేమ్స్ కుంపట్ల మాట్లాడుతూ.. మత స్వేచ్ఛను వక్రీకరించడం, మత మార్పిడిని నేరంగా చూపి హిందువుల్లో ద్వేషం కలిగేలా ప్రణాళిక రచిస్తున్నారని పేర్కొన్నారు. క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులను ప్రపంచ వ్యాప్తంగా తెలిపేందుకు అక్టోబర్ ఆరో తేదీ నుంచి శాంతియుతంగా నిరసన, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.


