సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం

Sep 17 2026 2:26 AM | Updated on Sep 17 2026 2:26 AM

● తాడేపల్లి ఆశ్రమం రోడ్డులో ఘటన ● ఘటనా స్థలంలోనే మృతురాలి ఫోన్‌, నగలు ● నున్న పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు ● మహిళ మృతిపై పలు అనుమానాలు

తాడేపల్లి రూరల్‌(మంగళగిరి): తాడేపల్లి పట్టణం ఆశ్రమం రోడ్డులో రెడ్ల సత్రం వద్ద సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. సీఐ వీరేంద్ర, ఎస్‌ఐ ఖాజావలి ఆ మృతదేహాన్ని పరిశీలించారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో మృతిచెందిన మహిళ ఫోన్‌, బంగారు నగలు లభించాయి. మృతురాలిని విజయవాడ కండ్రికకు చెందిన మాలకొండ మహేశ్వరి (44)గా గుర్తించారు. బంధువులు పోలీసులకు తెలిపిన సమాచారం మేరకు.. గత శనివారం మహేశ్వరి సింగ్‌నగర్‌లో తను పనిచేస్తున్న కూరగా యల మార్కెట్‌ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయింది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని కుమార్తె సింధూర లక్ష్మికి ఫోన్‌ చేసి స్విచ్చాఫ్‌ చేసింది. కుమార్తె వెంటనే బంధువుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో నున్న పోలీస్‌స్టేషన్‌తో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. సగం కాలిన మహిళ మృతదేహం సమాచారం తెలిసిన డీఎస్పీ మురళీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అనుమానాస్పదంగానే..

మల్లేశ్వరి ఆశ్రమం రోడ్డులోకి ఎలా వచ్చింది, పెట్రోల్‌ ఎక్కడ కొన్నది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమం రోడ్డులో క్రిస్టియన్‌ శ్మశాన వాటిక గోడపక్కనే కంకర గుట్టపై తగలబడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె చెప్పులు అదే ప్రాంతంలో విడివిడిగా దూరంగా ఉన్నాయి. మంగళసూత్రం, తాడు, చెవి దుద్దులు, ఫోన్‌ ఒక కవరులో పక్కన పెట్టిన ఉన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఆత్మహత్య చేసుకుందామని అక్కడకు వస్తే ఎవరైనా వేధించి పెట్రోల్‌ పోసి తగలబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలం వద్ద పెట్రోల్‌ బాటిల్‌, అగ్గిపెట్టె లభించలేదు. తన కుమార్తెతో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నాను, శరీరం అంతా మంటగా ఉందని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసిందని నున్న పోలీసులు తెలిపారు. పెట్రోల్‌ పోసుకుని తగలపెట్టుకున్న తరువాత కుమార్తెకు ఫోన్‌ చేస్తే ఆమె ఫోన్‌, నగలు క్యారీ బ్యాగ్‌లోకి ఎలా వచ్చాయి? ఆ వస్తువులు కాలినట్లు కనిపించడం లేదు. సదరు మహిళ ఆత్మహత్య చేసుకుందామని అక్కడకు వస్తే మద్యం మత్తులో ఉన్న వారు ఏమైనా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement