తెన్నేరు మహిళది హత్యేనని తేల్చిన పోలీసులు
కంకిపాడు: వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది. ఉంచుకున్నోడే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. అనుమానాస్పద మృతిని పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
కలిసి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది..
ఏలూరు జిల్లా కై కలూరు మండలం వింజరం గ్రామానికి చెందిన జొన్నాదుల మేరీ(33) తనతో వివాహేతర సంబంధం నడుపుతున్న తోకల వినోద్‌కుమార్ అనే వ్యక్తితో పది రోజులు క్రితం తెన్నేరు గ్రామంలోని ఇటుక బట్టీల వద్దకు పనికి వచ్చింది. తరచూ వీరు ఇక్కడికి పనులకు వస్తుంటారు. అదే విధంగా ఇద్దరూ ఇటుక బట్టీలకు వచ్చారు. ఈనెల 24వ తేదీన బట్టీల వద్ద ఎవరూ లేని సమయంలో వారు ఉండే పాకలో మేరీ, వినోద్‌కుమార్‌లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వినోద్‌కుమార్ మెడకు గుడ్డతో బిగించి హత్య చేసినట్లు మృతు రాలి భర్త శివకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నాడు. ఘటనాస్థలాన్ని సందర్శించిన కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ, ఎస్‌ఐ సందీప్, సిబ్బంది వివరాలు సేకరించి హత్యకేసు నమోదు చేశారు.
అనుమానమే కారణమా?
గత కొద్ది రోజులుగా మేరీ వేరే వ్యక్తులతో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకుని ఇదే విషయమై వినోద్‌కుమార్ తరచూ గొడవలు పడేవాడని స్థానికులు చెబుతున్నారు. హత్యకు ఇది కూడా కారణంగా పోలీసులు భావిస్తున్నారు. లేక మరేదైనా కారణం అయ్యి ఉంటుందా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
పోలీసుల అదుపులో..
హత్యకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు వినోద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మేరీ మృతి అనంతరం అక్కడి నుంచి కంకిపాడు వచ్చిన వినోద్‌కుమార్ భోజనం పార్సిల్‌ను ఓ మిత్రుడికిచ్చి మేరీకి ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలుస్తోంది. భోజనం ఇచ్చేందుకు వెళ్లిన వ్యక్తి ద్వారా హత్య జరిగిన ఘటన వెలుగు చూసిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ద్వారా నిందితుడిని గుడివాడ పరిసరాల్లో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కంకిపాడు స్టేషన్‌కు ఉంచినట్లు సమాచారం.


