వత్సవాయి: బడి ఈడు పిల్లలందరూ తప్పని సరిగా పాఠశాలల్లోనే ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని భీమవరం, మక్కపేట గ్రామాల్లో ఆయన శని వారం పర్యటించారు. ‘బడి పిలుస్తోంది’లో భాగంగా విద్యార్థుల ఇళ్లకు కలెక్టర్ స్వయంగా వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. మండలంలో 563 మంది బడి బయట ఉన్న చిన్నారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ చిన్నారులను పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో జరుగుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అనంతరం లింగాలలో ఇటీవల అభివృద్ధిచేసిన డొంకరోడ్లను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘరాం, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్‌తో కలిసి ప్రారంభించారు. డీఈఓ చంద్రకళ, మండల ప్రత్యేకాధికారి విజయకుమారి, ఎంపీడీఓ ఎన్.రాంబాబు, ఎంఈఓ ఎల్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ క్లీన్ స్వీప్‌నకు శ్రీకారం
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మునిసిపల్ వ్యవహారాల శాఖ నాలుగు వారాల ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. విజయవాడ సాంబమూర్తి రోడ్డులోని కూర్మయ్య బ్రిడ్జి వద్ద శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మునిసిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ బి.అనిల్ కుమార్‌రెడ్డి, మునిసిపల్ ధ్యానచంద్ర, ఆపరేషన్ క్లీన్ స్వీప్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ జి.సమరం తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరాలో
అంతరాయం లేకుండా చూడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ హెచ్ ఆర్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి సూచించారు. శనివారం 132 కేవీ విజయవాడ ఆటోనగర్ సబ్‌స్టేషన్‌ను ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ – హెచ్‌ఆర్ డైరెక్టర్ మూర్తి సందర్శించి లోడ్స్ మానిటరింగ్ నిర్వహించారు. సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, లోడ్ పంపిణీ పరిస్థితులను పరిశీలించి, ఓవర్‌లోడ్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజినీర్లు , విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యవర్గం
పెనమలూరు: కృష్ణాజిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ (కేడీఎఫ్‌ఏ)కార్యవర్గం ఎన్నిక కానూరులో శనివారం జరిగింది. తొలుత జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా హైకోర్టు న్యాయవాది స్టాలిన్, ఒలంపిక్ అసోసియేషన్ పరిశీలకుడు మహేష్, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ పరిశీలకుడు జి.పవన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రకియ నిర్వహించారు. అధ్యక్షుడిగా జి.అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులుగా ఆర్.సురేష్‌బాబు, మక్కె సురేష్, జి.రాధమ్మ, కోశాధికారిగా నరహర వెంకట రవికుమార్, సభ్యులుగా బ్యూలారాణి, కన్యాకుమారి, తిరుపతమ్మ, కె.మణిబాబు, మస్తాన్, కె.రాజా, రాజు, డి.రాజేష్, మధు, సైపుల్లా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్‌ఏ ట్రెజరర్ విజయ్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కోనసీమ జిల్లా అధ్యక్షుడు నీలాద్రి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శేషగిరి తదితరులు పాల్గొన్నారు.


