వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఏటా విద్యా సంవత్సర ప్రారంభంలో అందించే విద్యా కానుక కిట్‌ను ఈ సారి సమయానికి ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడం దారుణ మన్నారు. యూనిఫామ్, షూస్, బ్యాగులు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని విమర్శించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నాయని, ఆలోగా విద్యా కానుక అందించలేమని సమగ్ర శిక్ష అధికారులు ప్రకటించడం బాధాకర మని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీపై కూడా స్పష్టత లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తోందన్నారు. పుస్తకాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామనే స్థాయికి ప్రభుత్వం దిగజారడం దౌర్భాగ్యకరమని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యా కానుక కిట్లు విద్యార్థుల చేతికి అందే వని గుర్తుచేశారు. కూటమి రెండేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రెండేళ్లుగా మనబడి నాడు–నేడు పనులను నిలిపివేసి పాఠశాలలను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల విద్యా కానుక పథకానికే ఎగనామం పెట్టిందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడకుండా వెంటనే విద్యా కానుక కిట్, పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందించాలని ప్రభుత్వాన్ని దేవినేని డిమాండ్ చేశారు.


