సాక్షి నెట్‌వర్క్: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పుల ధాటికి జనం గుండెలు ఆగిపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో శనివారం పది మంది మత్యువాత పడ్డారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కేతనకొండ గ్రామానికి చెందిన పఠాన్ నాగుల్ మీరా (32) తన సోదరుల భాగస్వామ్యంతో చికెన్ షాపు నిర్వహిస్తాడు. షాపులో శుక్రవారం అంతా పనిచేశాడు. సాయంత్రానికి తీవ్రమైన జ్వరం రావడంతో జూపూడిలోని వైద్యశాలలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
గంపలగూడెం మండలం గాదెవారిగూడెం గ్రామానికి చెందిన పసుపులేటి నరసింహారావు(64) శనివారం తన దిన చర్యలో భాగంగా గ్రామంలో తన సమకాలికులతో గడిపి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. దడగా ఉందంటూ కుటుంబసభ్యులను మజ్జిగ అడిగి తాగాడు. మంచంపై పడుకున్న కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో ఆర్‌ఎంపీ వైద్యుడ్ని రప్పించేలోగా మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులున్నారు.
గంపలగూడెం పడమట దళివాడకు చెందిన కోట ప్రవీణ్(35) శనివారం ఉదయం మామిడి కోతకని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం మూడున్నర సమయంలో పంచాయతీ కార్యాలయం సమీపాన గల మంచినీటి ట్యాప్ వద్ద పడిపోయి ఉన్నట్లు స్థానికులు గమనించారు. సమాచారం తెలిసి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.
కొటికలపూడిలో దివ్యాంగురాలు..
ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు మేకా నిర్మల (55) భర్త లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ తన కుమారుడి వద్ద ఉంటోంది. ఇటీవల ఆరోగ్యం సహకరించక ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని కుటుంబ సభ్యులకు చెప్పింది. జ్వరం కూడా ఉండటంతో ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. వడదెబ్బతోనే మరణించినట్లు బంధువులు తెలిపారు.
కూర్చున్న చోటే కుప్పకూలిన యాచకులు...
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఇద్దరు గుర్తుతెలియని యాచకులు వడదెబ్బతో మృతి చెందారు. సేకరించిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బస్టాండ్ పరిసరాలలో యాచన చేసి జీవనం సాగిస్తున్నారు. వీరు శనివారం సాయంత్రం 43, 44 ప్లాట్‌ఫామ్ వద్ద వడదెబ్బ వల్ల కూర్చున్న చోటే కుప్ప కూలిపోయారు. వీరి వయస్సు ఒకరికి 55, మరొకరి 60 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కంచికచర్ల మండలంలో మరో వృద్ధురాలు..
కీసరలో ఉంటున్న ఓ వృద్ధురాలు శనివారం వడదెబ్బకు మృతి చెందింది. వీరులపాడు మండలం నందలూరు గ్రామానికి చెందిన ఎన్ రాజమ్మ(62) కొంతకాలంగా కంచికచర్ల మండలంలోని కీసర ప్రధాన సెంటర్ వద్ద ఉంటోంది. శుక్రవారం ఆమె ఎండవేడికి తట్టుకోలేక ఓ టైలర్ షాపు వద్ద కుప్ప కూలిపోయింది. గమనించిన ప్రవేటు ఎలక్ట్రీషియన్ శ్రీకాంత్ 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ వాహన సిబ్బంది వచ్చి ఆమెను పరీక్షించి ప్రథమ చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
తారాపేటలో గుర్తుతెలియని వ్యక్తి...
విజయవాడ వన్‌టౌన్ తారాపేట రాజకుమారి థియేటర్ సమీపంలోని ఓ అరుగుపై గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు శనివారం పోలీసులకు సమాచారం అందింది. వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు లభించలేదు. ఎండకు తాళలేక మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరు కాకుండా శనివారం విజయవాడ సత్యనారాయణపురంలో ఒకరు, జీజీహెచ్‌లో కూడా ఒక యాచకుడు వడదెబ్బ కారణంగా మృతి చెందినట్టు తెలిసింది.
మృతి చెందిన యాచకులు
ఎన్టీఆర్ జిల్లాలో వడదెబ్బకు పది మంది మృతి


