హనుమాన్‌జంక్షన్ రూరల్: స్థానిక తారకరామ కాలనీలో ఈ నెల 18వ తేదీన జరిగిన చోరీ కేసును హనుమాన్‌జంక్షన్ పోలీసులు నాలుగు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయటంతో పాటు 173 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను శనివారం హనుమాన్‌జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గన్నవరం ఇన్‌చార్జి డీఎస్పీ పి.శ్రీనివాస్ మీడియాకు వివరించారు. ఈ నెల 18వ తేదీన తారకరామ కాలనీకి చెందిన వడ్లమూడి ఆంజనేయులు ఇంటికి తాళం వేసి పొరుగూరు వెళ్లారు. దుండగులు ఇంటి తాళాలను ధ్వంసం చేసి బీరువాలో భద్రపర్చిన 169 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించినట్టు బాధితుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనాస్థలంలో నిందితుల వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించటంతో పాటుగా దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక అంశాల ఆధారంగా విజయవాడలోని ఆంజనేయవాగు సెంటర్‌కు చెందిన పాత నేరస్తులు వేములవాడ సురేంద్ర, సురా అర్జున్, కె.వాసు చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. వీరి నుంచి మొత్తం 173 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు దుండగులపై కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఐదు దొంగతనం కేసులు, ప్రకాశం జిల్లాలో మరో కేసు నమోదయినట్లుగా డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదించిన సీఐ ఎల్.రమణ, ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు సోమ వెంకటేష్, మోహన్, కె.సంపత్, నబీలను డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు.
బంగారు ఆభరణాలు,
ద్విచక్ర వాహనాలు స్వాధీనం


