కాలువ గట్లనూ వదలడం లేదు..
కృష్ణా జిల్లాలో పేట్రేగిపోతున్న మట్టి మాఫియా
పెడనలో పంట బోదెల నుంచి
పామర్రు మండలం బోయినవారిపాలెంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు
కృత్తివెన్ను మండలం జాతీయ రహదారిపై ట్రాక్టర్ల ద్వారా
తరలిపోతున్న మట్టి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులను ఇష్టారాజ్యంగా చెరపడుతోంది. నియోజకవర్గాల్లోని టీడీపీ నేతల అండతో ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ కోట్ల రూపాయలను దండుకుంటోంది. ముఖ్యంగా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో దందా మూడు పొక్లయిన్లు.. ఆరు లారీలు అన్న చందంగా సాగిపోతోంది.
పామర్రులో యథేచ్ఛగా..
స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఇక్కడి చెరువులపై ‘పచ్చ’గద్దలు వాలిపోయాయి. రూ.10కోట్లపైగా ఇప్పటికే మట్టి దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ దందా అంతా నియోజకవర్గంలోని ఓ లంబోదర నేత, మట్టి తోలకాల్లో ‘ప్రావీణ్యం’ కలిగిన మరో నేత, సురేష్ అనే వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజా ప్రతినిధి, దోపిడీలో ఆరితేరిన ఈ ముగ్గురు నేతల ఒత్తిడితో రెవెన్యూ, పోలీసులు సైతం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజా అవసరాల పేరుతో..
● ప్రజా అవసరాలు, పూడికతీత పేరుతో చెరువులను చెరబడుతున్నారు. కనుమూరు నేషనల్ హైవే పక్కన చెరువులో ఆరు రోజుల నుంచి యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు.
● రోజుకు 1500కు పైగా ట్రాక్టర్లు, లారీల్లో మట్టి తరలించి, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుక రాయి, పరిశ్రమకు తరలిస్తున్నారు.
● ఈ ముగ్గురు నేతల త్రయంతో పాటు, స్థానిక నేతలు కలిసి ఇక్కడ ట్రాక్టర్లు మట్టికి రూ.1000, లారీకి రూ.3000 వసూలు చేస్తున్నారు.
● పసుమర్రు గ్రామం బోగిరెడ్డిపల్లె, రిమ్మనపూడి చెరువుల్లో మూడు రోజులుగా జరుగుతున్న మట్టి తవ్వకాల్లో 1000కి పైగా ట్రాక్టర్ల మట్టిని బయటికి తరలించి, జేబులు నింపుకున్నారు.
● పామర్రు–గుడ్లవల్లేరు రహదారిలో ఉన్న బోయినవారిపాలెంలోని 12 ఎకరాల చెరువులో గ్రామ అవసరాల పేరుతో అనుమతులు తీసుకొని, పొక్లయిన్‌లు ఏర్పాటు చేసి, పెద్ద పెద్ద లారీలతో రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ చెరువులో మట్టి తవ్వుకొనేందుకు రూ.3కోట్లు తీసుకొని ఓ వ్యక్తికి కాంట్రాక్టు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.
● పామర్రు, బోగిరెడ్డిపల్లె, దేవానందపురంలలో పంట బోదులను సైతం అక్రమార్కు లు వదలకుండా మట్టి తవ్వి ఇసుక రాయి, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలంలో కాలువ గట్లను సైతం వదలటం లేదు. క్రోసూరులో కాలువ గట్లను తవ్వుతున్నారని సాక్షాత్తూ నీటి పారుదల శాఖ ఏఈ రమేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వరద వస్తే ఐనపూడి చానల్‌పైన వేలాది ఎకరాల పంట పొలాలు మునుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు చిన్న ముత్తేవిలో సైతం అక్రమ మట్టి తవ్వకాల దందా సాగుతోంది.
పమిడిముక్కల మండలం మేడూరు, మంటా డ, హైవే పక్కన గురజాల చెరువుల్లో అక్రమంగా మట్టిని తవ్వి, పచ్చ తోడేళ్లు మేస్తున్నాయి. పెదపారుపూడి మండలంలో ఈదర మద్దాళి, వెంటాప్రగడ, మోపూరులో అక్రమ మట్టి తవ్వకాలతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు.
తోట్లవల్లూరు మండలంలోని గరికపర్రులో పాఠశాల పక్కన ఉన్న చెరువును శ్మశానం కోసం మట్టి పేరుతో తవ్వుతూ, బయటికి తరలిస్తూ దర్జాగా దోపిడీ చేస్తున్నారు. దీంతో పలు చోట్ల చెరువుల్లో మట్టి తవ్వి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. మొత్తం మీద పామర్రు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రింపగళ్లు అక్రమ మట్టి తవ్వకాలు చేస్తూ, కోట్ల రూపాయలు దండుకొంటున్నారు.
పామర్రు నియోజకవర్గంలో
అడ్డూఅదుపూ లేకుండా దందా
కోట్ల రూపాయలు చేతులు
మారుతున్న వైనం
కన్నెత్తి చూడని అధికారులు
పెడన నియోజకవర్గంలోనూ
అదే పంథా
వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్న
టీడీపీ నేతలు
పెడన మండలంలో చెన్నూరు, పెనుమల్లి, జింజేరు, నడుపూరు గ్రామాల పరిసరాలలో అక్రమంగా చెరువులను, మట్టి దిబ్బలను తవ్వేస్తున్నారు. పంట బోదెలను సైతం మాయం చేస్తున్నారు. పెడన నుంచి మచిలీపట్నంకు నిత్యం టిప్పర్లు ద్వారా మట్టి తరలిపోతుంది. మచిలీపట్నంలోని కృష్ణాజిల్లా టీడీపీ కార్యాలయం, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో మెరక పనులకు మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కృత్తివెన్ను మండలం మునిపెడ, ఇంతేరు, చినగొల్లపాలెం ప్రాంతా ల్లో సైతం చెరువులను తవ్వేస్తూ మట్టిని పక్కనే ఉన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి టిప్పర్లు ద్వారా తరలించేస్తున్నారు.
బంటుమిల్లి, గూడూరు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. గూడూరు మండలంలో పర్ణశాల, ఆర్వీపల్లిలో టీడీపీ నాయకులు మట్టిని తవ్వున్నారని జనసేన నాయకులు కలెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదులు చేస్తున్నా ఎటువంటి స్పందన ఉండటం లేదు.


