ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య భగవానుడికి సూర్యోపాసన సేవ, సూర్య నమస్కారాలను నిర్వహించారు. సేవలో పాల్గొనడం వల్ల భక్తులకు ఆరోగ్య ప్రాప్తితో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొనగా, వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
గన్నవరం: చైన్నె–కోల్కతా జాతీయ రహదారిని గన్నవరం ప్రాంతంలో సుందరంగా తీర్చిదిద్దాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. స్థానిక విమానాశ్రయం నుంచి చిన్నఆవుటపల్లిలోని పశ్చిమ బైపాస్ వరకు జాతీయ రహదారిని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయానికి ముఖద్వారంలో ఉన్న గన్నవరం ప్రాంతంలో జాతీయ రహదారి బ్యూటిఫికేషన్పై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించడంతో పాటు గోడలకు ఆకర్షణీయమైన రంగులు వేయాలని సూచించారు. దెబ్బతిన్న పుట్పాత్లకు వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి డి. ధనలక్ష్మి, గుడివాడ డీఎల్పీఓ సంపత్కుమారి, తహసీల్దార్ కె. వెంకట శివయ్య, ఎంపీడీఓ టి. స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పోరంకిలోని విజ్ఞాన్ భారత్ స్కూల్ ఆవరణలో కృష్ణాజిల్లా జిల్లా టీమ్ ఓపెన్ అండ్ ఉమెన్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహపూరిత వాతావరణంలో ఆదివారం జరిగింది. ఈ టోర్నమెంట్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 32 మంది చెస్ క్రీడాకారులు పాల్గొని వారిలోని ప్రతిభను చూపారు. బాలుర విభాగంలో రుషీల్, కార్తికేయ, సాకేత్, విగ్నేష్ గుప్తా, బాలికల విభాగంలో జాహ్నవి, అవిష్క, గీతా మాధురి, హర్షిత విజేతలుగా నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి విజ్ఞాన్ భారత్ స్కూల్ డైరెక్టర్ శేషాద్రిరావు, కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఎం.దివ్వ హాజరై విజేతలకు జ్ఞాపికలు, మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎం.దివ్య మాట్లాడుతూ ఈ టోర్నీలో విజేతలైన బాలురు జూలై 18,19 తేదీల్లో నంద్యాలలో జరిగే ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్షిప్లో, బాలికలు జూలై 4,5 తేదీల్లో రాజమండ్రిలో జరిగే ఏపీ స్టేట్ సీనియర్ ఉమెన్ చెస్ చాంపియన్షిప్లో కృష్ణాజిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. చీఫ్ ఆర్బిటర్స్ ఏ.మణి రత్నం, పి.రవీంద్రతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్లు ద్వారా ఆదివారం ఆదాయం రూ. 6,90,951 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. సేవా టికెట్లతో రూ. 3,78,352, లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 1,15,665, విరాళాల రూపేణా రూ. 1,30,064, స్వామివారి కల్యాణ కట్ట టికెట్లు విక్రయించగా రూ. 25,440, స్వామివారి దర్శనం టికెట్ల రూ. 38,800 తదితరాలు కలిపి మొత్తం రూ. 6,90,951 ఆదాయం సమకూరినట్లు ఆలయ డీసీ వివరించారు.


