బస్టాండ్(విజయవాడ పశ్చిమ): విద్యుత్ బస్సుల ఆపరేటర్ల కోసం ఆర్టీసీ డిపోలను ఖాళీ చేయించటం దారుణమని ఈ విధానాన్ని మానుకోవాలని రాష్ట్ర ప్రజారవాణా సంస్థ(ఏపీ పీటీడీ)ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచనను విరమించుకొవాలని కోరుతూ ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం పండిట్ నెహ్రూ బస్టేషన్ ఆవరణలోని విజయవాడ మెయిన్ డిపో, గవర్నర్‌పేట–1, 2 డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి, విజయవాడ జోనల్ కార్యదర్శి వైఎస్ రావు మాట్లాడుతూ ప్రజా రవాణా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాధరపురం, గుంటూరు–2, నెల్లూరు–2 డిపోలను ఇప్పటికే ఖాళీ చేయించారని మంగళగిరి డిపోను సైతం ఖాళీ చేయించే పనిలో ఉన్నారన్నారు. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలని కొరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జీఎం రావ్, ఎస్‌కే మోహిద్దీన్, డిపోల అధ్యక్షుడు, కార్యదర్శులు, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ పీటీడీ ఎంప్లాయీస్
యూనియన్ నిరసన దీక్ష


