వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహించారు. ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకూ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకూ పరీక్ష జరిగింది. గంట ముందుగా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. అభ్యర్థులను క్షుణంగా పరిశీలించి అనంతరం అనుమతించారు. ఈ సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రుల సందడి నెలకొంది.
నేటి నుంచి 24వ తేదీ వరకు
సూచనలు, అభ్యంతరాల స్వీకరణ
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల పునర్విభజనపై ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం విడుదల చేశారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో ఇప్పటి వరకు ఉన్న 64 డివిజన్లను 86 డివిజన్లకు పెంచుతున్నామని, ఈ మేరకు డివిజన్ల సరిహద్దులపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించామన్నారు. డివిజన్ల సరిహద్దులపై అభ్యంతరాలను ఈ నెల 18నుంచి 24వ తేదీ వరకు వీఎంసీ ప్రధాన కార్యాలయంలో, చిట్టినగర్‌లోని సర్కిల్–1 కార్యాలయంలో, సత్యనారాయణపురంలోని సర్కిల్–2 కార్యాలయంలో, పటమట లోని సర్కిల్–3 కార్యాలయంతోపాటు నగర పరిధిలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ నెల 24వ తేదీలోపు ప్రజలు, రాజకీయ పార్టీలు సూచనలు, అభ్యంతరాలంటే వీఎంసీ ప్రధాన కార్యాలయంలో రాత పూర్వకంగా అందించాలని సూచించారు.


