గ్రీన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహిద్దాం... ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి చేయీ చేయీ కలుపుదాం స్వచ్ఛాంధ్ర...స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
కంచికచర్ల: పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడే గ్రీన్ ఎంట్రప్రెన్యూర్ షిప్‌ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, ఈ దిశగా ఔత్సాహికులను చేయిపట్టి నడిపించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామ చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం(ఎస్ డబ్ల్యూపీసీ) వద్ద పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ ఆ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అంగన్‌వాడీ, వైద్య ఆరోగ్యం ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు, వర్మీ కంపోస్టు తదితర స్టాళ్లను సందర్శించారు. ముందుగా స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహిళలను సత్కరించారు. గ్రీన్ అంబాసిడర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఎస్ డబ్ల్యూపీసీ షెడ్‌కు చేరిన ప్లాస్టిక్‌ను స్వచ్ఛ రథానికి అందజేసి బదులుగా పుస్తకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణ హిత ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. రీసైక్లింగ్, రిపేర్ అండ్ రీ యూజ్ వ్యాపారాలపై దృష్టి సారించేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రజలు, వ్యాపారసంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. డీపీఓ పి.లావణ్యకుమారి, డీఆర్‌డీఏ పీడీ నాంచారరావు, డీటీ మానస, ఎంపీడీఓ దేవరపల్లి వెంకటేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.


