ఉమ్మడి జిల్లాలో పరీక్షకు హాజరైన విద్యార్థులు 12,087 మంది మళ్లీ పరీక్ష రాయాల్సి రావటంపై మండిపాటు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
నీట్ పరీక్ష రద్దుపై విద్యార్థుల ఆవేదన
సమాధానం
చెప్పేదెవరు?
ఇన్నాళ్ల కష్టం వృథాయేనా?
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు ఈ నెల మూడో తేదీన నిర్వహించిన ‘నీట్ – 2026’ను రద్దు చేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరీక్షకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 12,087 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఏకంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘నెలల తరబడి నిద్రాహారాలు మానుకుని కష్టపడి చదివి నీట్ పరీక్ష రాశాం. ఇప్పుడు పేపరు లీకై ంది, రద్దు చేశాం. మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం’ అంటే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు వాపోతున్నారు. పరీక్ష నిర్వహించిన ప్రభుత్వ ఏజెన్సీతో పాటు కేంద్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్ష
ఈ నెల మూడో తేదీన నిర్వహించిన నీట్ పరీక్షకు ఉమ్మడి జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి 12,259 మంది విద్యార్థులను కేటాయించారు. వారిలో 12,087 మంది పరీక్షకు హాజరయ్యారు. 2025లో 13,625 మంది విద్యార్థులను కేటాయించగా 13,455 మంది హాజరయ్యారు. 2024లో సుమారు 15 వేల మంది పరీక్ష రాశారు. కలెక్టర్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ పరీక్ష నిర్వహణలో తలమునకలయ్యారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో గెస్ పేపర్ పేరుతో సోషల్ మీడియాలో తిరిగిన ప్రశ్నాపత్రం అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు తేలింది. దీంతో ఈ నెల మూడో తేదీ జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
తరచూ గందరగోళం
నీట్ పరీక్షకు సంబంధించి తరచూ గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. గతంలోనూ నీట్ పరీక్ష పేపర్ ముందుగానే బయటకు రావటంతో కోర్టు వరకు వివాదం చేరింది. కొన్ని వందల మందితో మళ్లీ పరీక్ష రాయించారు. తాజాగా నీట్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావటం, అది నిజమైనదిగా స్పష్టం కావటంతో ఏకంగా పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ గందరగోళ పరిస్థితులు విద్యార్థులను మరింత కుంగదీస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
ఎంతో కష్టపడి నీట్ పరీక్ష రాశాను. చాలా నెలలుగా ఇంటర్మీడియెట్ కోర్సుతో పాటుగా నీట్ పరీక్ష కోసం కష్టపడ్డాను. మా అమ్మ, నాన్న సైతం నాతో పాటుగా ఎంతో కష్టపడ్డారు. ఫీజులు కట్టి ప్రోత్సహించారు. అంతా సజావుగా జరిగిన తరువాత ఇప్పుడు నీట్ పరీక్ష రద్దు చేస్తున్నామని ప్రకటిస్తే ఎలా? ఇన్నాళ్ల కష్టం వృథయేనా? నాకే కాదు పరీక్ష రాసిన మా ఫ్రెండ్స్ అందరం బాధపడుతున్నాం. మళ్లీ పరీక్ష రాయాలంటే చాలా కష్టం.
– సీహెచ్ ధేనుక, విద్యార్థిని, విజయవాడ
నెలల తరబడి కష్టపడి చదివి రాసిన నీట్ పరీక్షను ఒక్కసారిగా రద్దు చేసినట్లు ప్రకటించటంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో శిక్షణ తీసుకుని నీట్ పరీక్షకు హాజరవుతారు. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటూ కుటుంబాలకు దూరంగా హాస్టళ్లలో ఉండి, వేకువ జాము నుంచి అర్ధరాత్రి వరకూ పుస్తకాలే లోకంగా చదువుతారు. అంతటి కష్టం బుడిదలో పోసిన పన్నీరుగా మారిందని విద్యార్థులు వాపోయారు. ఈ పరీక్షను చాలా బాగా రాశామని, సీటు వస్తుందన్న నమ్మకం ఉందని, మళ్లీ పరీక్ష రాయాలంటే తమకు నష్టమేనని పేర్కొన్నారు. ఇన్నాళ్లు తాము పడిన కష్టానికి ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.


