షార్ట్ సర్క్యూట్‌తో పాటు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఘటన!
ప్రమాద సమయంలో ఇంట్లో లేని కుటుంబ సభ్యులు
పేలుడు ధాటికి కూలిన అపార్ట్‌మెంట్ గోడ
ఒకరికి తీవ్ర గాయాలు
పూర్తి విచారణ చేపట్టాం..
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ పటమట ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీపీ సత్యానందం (1991 బ్యాచ్) డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆయన వీఆర్‌లో ఉన్నారు. ఆయన పటమటలంక నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ప్రత్యుష అపార్టుమెంట్‌లో 302 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వేసవి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం విదేశాలకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన నివాసం ఉంటున్న అపార్టుమెంట్ ఫ్లాట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వంటగదిలోని గ్యాస్ సిలిండర్ పేలి ఎదురు అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వ్యక్తి తలకు గోడ శిథిలాలు తగిలాయి. విజయవాడ సిద్ధార్థ స్కూల్లో విధులు నిర్వహిస్తున్న గొట్టిపాటి శ్రీనివాసరావుకు తలకు బ్లాస్టింగ్ శిథిలాలు తగిలి తీవ్ర గాయాల య్యాయి. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన గురించి తెలుసుకున్న పటమట అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని సీలింగ్, సామాన్లు కాలిపోయాయి. ఈ ప్రమాదకారణంగా సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని అంచనా ఫైర్ సిబ్బంది అంచనా వేశారు.
ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
పటమట ప్రత్యూష అపార్ట్‌మెంట్ ప్రమాద ఘటనను వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ పరిశీలించారు. పొరుగున ఉన్న అపార్ట్‌మెంట్ వాసు లతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరు దురదృష్టకరమని, ప్రమాదం సమయంలో అపార్ట్ మెంట్‌లో ఎవరూ లేరని, మంటలు వస్తుండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు అందరినీ అప్రమత్తం చేసే సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందన్నారు. ఇలాంటి ప్రమాదాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
వేసవి కారణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రత తీవ్రత దృష్ట్యా ప్రమాదం జరిగిందని ప్రాఽథమిక అంచనాకు వచ్చాం. అయితే ప్రమాదం జరిగిన కారణాలను అన్వేషిస్తున్నాం. ఈ ప్రమాదానికి రెండు కారణాలుగా తెలుస్తున్నాయి. విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణమా లేక గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనా అనే కోణంలో విచారణ చేపట్టాం. పోర్టుకోలో ఉన్న ఏసీ అవుట్‌లెట్ నుంచి జరిగిన షార్టు సర్క్యూటా లేక ముందే వంటగదిలో సిలిండర్ పేలిందా అనే కోణంలో విచారణ చేపట్టాం.
– కె.దామోదర్, సెంట్రల్ జోన్ ఏసీపీ


