చిలకలపూడి(మచిలీపట్నం): పోక్సో చట్టం పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలిసి సీ్త్ర, శిశు సంక్షేమ, ఇతర సంక్షేమాధికారులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. గర్భధారణ, లింగ నిష్పత్తి, పోక్సో చట్టం అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ.. జిల్లా లింగ నిష్పత్తిలో వెనుకబడి ఉందని, ముఖ్యంగా ప్రతి వెయ్యి మందికి మగ వారికి 921 మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. 101 పిల్లలు తప్పిపోయారని వారిని వెతికి పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. యుక్తవయసులో గర్భధారణ అధికంగా ఉంటోందని దీనిపై తల్లిదండ్రులు, పెళ్లయిన యువతీయువకులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయో, లేదో మండల ప్రత్యేకాధికారులను పంపించి పరిశీలించే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీఐఓ డాక్టర్ ప్రేమచంద్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహెద్‌బాబు, గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిదూర్జటి, డీఈఓ సుబ్బారావు పాల్గొన్నారు.


