కోమటిగుంట రైతులు
ఎ.కొండూరు: క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు కోసం వ్యవసాయ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని ఎ.కొండూరు మండలం కోమటికుంట గ్రామ రైతులు స్పష్టం చేశారు. తహసీల్దార్ ఉదయ్ భాస్కరరావును మంగళవారం కలిసిన రైతులు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోమటిగుంట రైతులు మాట్లాడుతూ ముత్తాతలు, తాతలు, తండ్రుల కాలం నుంచి వందల ఏళ్లుగా ఈ భూములను సాగు చేస్తున్నామని తెలిపారు. ప్రాణంగా భావించే సాగు భూములను ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం సేకరించాలని చూడటం సరికాదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు వదులుకోబోమని వారు తేల్చిచెప్పారు. టీడీపీ సీనియర్ నేత గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ భూ సమీకరణ విషయంలో రెవెన్యూ అధికారులు రైతులకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు భూపరిశీలనకు రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన వివరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులను కోరారు. వారి క్షేమమే ముఖ్యమని ఆయన తెలిపారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ ఏపీఐఐసీ ద్వారా క్వాంటం వ్యాలీ ప్రతినిధులు భూములను కేవలం పరిశీలించడానికి మాత్రమే వచ్చారని తెలిపారు. పూర్తి వివరాలకు రైతులు కలెక్టర్‌ను కలిసి మాట్లాడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రైతులు వేములకొండ భాస్కరరావు, వేములకొండ సాంబశివరావు, కె. సురేష్, సీహెచ్ వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.


