పెనమలూరు: భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని జలవనరులను పొదుపుగా వాడాలని డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. కానూరులోని ఏపీ ఎస్‌ఐఆర్డీ భవన్‌లో మంగళవారం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో జలవనరుల స్థిరత్వం అంశంపై నిర్వహించిన వర్కుషాపును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి కుటుంబానికి తగినంత నీరు ఇవ్వడానికి జల్‌జీవన్ మిషన్ 2.0 అమలు చేస్తామన్నారు. నీటి వినియోగంపై ఈ నెల 6 నుంచి జూలై 14 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


