జూన్‌లో డ్రగ్ డిటెక్షన్ డ్రైవ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు డ్రగ్స్‌పై దండయాత్ర2.0 త్వరలో ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు వెల్లడించారు. జూన్‌లో విద్యాసంస్థలు, హాట్‌స్పాట్ లలో డ్రగ్ డిటెక్షన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజ హితం కోసం చేసే ఈ ప్రయత్నంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం, నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సెలింగ్ సేవలు తదితరాలపై మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. డ్రగ్స్‌పై దండయాత్ర విజయం, జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డీ అడిక్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్‌స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై చర్చించారు.
1972 టోల్‌ఫ్రీ నంబర్‌పై అవగాహన..
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలోని గుర్తించిన 150 హాట్‌స్పాట్‌ల్లో, కీలకమైన ప్రాంతాల్లో రాత్రిపూట కూడా అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్లతో నిఘా ఉంచాలని సూచించారు. 1972 టోల్‌ఫ్రీ నంబరుపైనా విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ హాట్‌స్పాట్‌లతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లోనూ నిఘా పెంచామని పేర్కొన్నారు. డీసీపీ కేజీవీ సరిత, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీజీ, వయో వృద్ధుల సంక్షేమ అధికారి వాడ్రేవు కామరాజు, ఈగల్ అధికారులు పాల్గొన్నారు.


