వైఎస్సార్ సీపీ కార్యకర్త ట్రాక్టర్ దగ్ధం
బూదవాడ(జగ్గయ్యపేట): గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త బాణావత్ నాగరాజుకు చెందిన ట్రాక్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నాగరాజు ఎప్పటి మాదిరిగానే మంగళవారం ఇంటి బయట ట్రాక్టర్‌ను నిలిపి ఉంచాడు. బుధవారం తెల్లవారు జామున నిత్ర లేచి చూసే సరికి ట్రాక్టర్ పాక్షికంగా తగలబడి ఉండటాన్ని గమనించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గ్రామానికి చేరుకుని ట్రాక్టర్‌ను పరిశీలించి నాగరాజును పరామర్శించారు. కుటుంబానికి జీవనాధారమైన ట్రాక్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేయటం బాధాకరమన్నారు. నిందితులను పోలీసులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మండల కన్వీనర్ బూడిద నరసింహారావు, నాయకులు పరిటాల పెద్ద సైదులు, భూక్యా గోపి, బాలకోటి, సతీష్ తన్నీరుతో పాటు బాధితుడిని పరామర్శించారు.
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు రింగ్ సెంటర్‌లో గుర్తుతెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. విజయవాడ పటమట పోలీసుల కథనం మేరకు.. రింగ్ సమీపంలోని ఏలూరు నాన్‌స్టాప్ బస్ స్టాండ్ సమీపంలో సుమారు 35 ఏళ్ల యువకుడు మృతి చెందాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ నెల 16వ తేదీన ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్న ఆ యువకుడిని గర్తించిన కండెక్టర్ రామవరప్పాడు రింగ్ వద్ద దింపివేశాడు. అప్పటి నుంచి బస్‌స్టాప్‌లోనే పడుకున్న యువకుడు బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. మృతుడి వంటిపై బ్లూకలర్ స్వెట్టర్ ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పటమట పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
పెనమలూరు: మండలంలోని గంగూరు గ్రామంలో ఓ వృద్ధుడు చెట్టుపై నుంచి కొందపడి మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన మద్దాల విల్సన్ (70) చెట్లు నరుకుతూ జీవనోపాధి సాగిస్తున్నాడు. అతను మంగళవారం గంగూరు అంబేడ్కర్‌నగర్‌లో ఆర్‌సీఎం చర్చి వద్ద వేప చెట్టు కొమ్మలు అడ్డుగా ఉన్నాయని నరకటా నికి వచ్చాడు. అతను చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విల్సన్‌ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం వేకువజామున మృతి చెందాడు. మృతుడి కుమారుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్: చెన్నయ్ – కోల్‌కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండ లంలో మంగళవారం అర్ధ రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డులో కె.సీతారామపురం వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న పేరం వెంకట రాజేష్ (21) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేరం వెంకట రాజేష్‌ను ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయిన పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. విజయవాడలో డెలివరీ బోయ్‌గా పనిచేస్తున్నాడని, మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఏలూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో వ్యక్తి (40) ఆచూకీ తెలియాల్సి ఉంది. దీనిపై హను మాన్‌జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరవల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు 45 సంవ త్సరాలు ఉంటుందని, మృతదేహం పూర్తిగా ఛిద్రమైందని, దీంతో అతను ఎవరో గుర్తించటం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. మృతుడు దుస్తులు ధరించకపోవటంతో యాచకుడు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్త ట్రాక్టర్ దగ్ధం
వైఎస్సార్ సీపీ కార్యకర్త ట్రాక్టర్ దగ్ధం


