మాకేం సంబంధం లేదు!
● బీఎస్సీ(ఎంఎల్టీ) విద్యార్థుల సమస్యలపై
హెల్త్ వర్సిటీ వీసీ చంద్రశేఖర్
● వర్సిటీ ఎదుట నిరసన తెలిపిన
విద్యార్థులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని 2021– 22 సంవత్సర బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలల నుంచి వచ్చిన బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులు డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్‌ను బుధవారం కలిశారు. ప్రధానంగా 2021–22 సంవత్సర బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను ఆప్షనల్‌గా పెట్టాలని లేదా గరిష్టంగా ఆరు నెలలకు పరిమితం చేసి, ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థుల నుంచి ఇంటర్న్‌షిప్ పేరుతో ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదనీ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్న్‌షిప్ కారణంగా పొడిగించిన సంవత్సరానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్న్‌షిప్ సమయంలో కనీసం నెలకు రూ.6,000 స్టైఫండ్‌తో పాటు వారాంతాల్లో సెలవు ఇవ్వాలని కోరారు.
మేం ఏం చేయలేం..
విద్యార్థుల డిమాండ్లపై వీసీ సానుకూలంగా స్పందించకపోవటంతో పాటు తాము ఏం చేయ లేమని స్పష్టం చేసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజులు వసూలు చేయమని తాము చెప్పలేదని, కనుక తమకు సంబంధం లేదని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి స్టైఫండ్ రిలీజ్ చేయడం కుదరదని పేర్కొన్నారని చెప్పారు. దాంతో విద్యార్థులు బయటకు వచ్చి యూనివర్సిటీ ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించారు.


