ప్రకృతి సాగు ఫలప్రదం
●వ్యవసాయ క్షేత్రమే పొలమే ప్రయోగశాల
●ప్రకృతి సాగుతో రసాయన ఎరువులకు స్వస్తి
●సొంతగా సేంద్రియ ఎరువుల తయారు
పెనుగంచిప్రోలు: మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన రైతు ఊరుగుండ్ల గోవర్ధన ప్రకృతి వ్యసాయానికి శ్రీకారం చుట్టారు. విభిన్న పంటలు సాగుచేస్తూ, వ్యవసాయ ఉత్పత్తులను సొంతంగా విక్రయిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. రెండేళ్ల క్రితం కశ్మరీ యూపిల్ బేర్ సాగుచేసి మంచి లాభాలు ఆర్జించారు. గత ఏడాది రెడ్‌గోల్డ్, మిక్స్ ఇండియా, బాల సుందరి అనే మూడు రకాల యాపిల్‌బేర్ పండ్లు మొక్కలు కోల్‌కత్తా నుంచి తీసుకొచ్చి తనకు ఉన్న 40 సెంట్ల పొలంలో నాటాడు. మరో ఎకరం కౌలుకు తీసుకుని కాకర, పొట్ల కూరగాయలు పండిస్తున్నాడు. ఎకరానికి 600 మొక్కలు నాటేందుకు కావాల్సి ఉండగా అర ఎకరంలో 300 మొక్కలు నాటాడు. ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది.
రోజుకు 80 నుంచి 100 కిలోలు దిగుబడి
యాపిల్‌బేర్ తోటలో ఈ ఏడాది కాపు మొదలై దిగుబడి ప్రారంభమయింది. ఫిబ్రవరి వరకు దిగుబడి వస్తుందని రైతు గోవర్ధన తెలిపారు. రోజుకు 80 నుంచి 100 కిలోల దిగుబడి వస్తోంది. కాయలు నాణ్యంగా, తీపిగా ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. యాపిల్ బేర్ పండ్లను గోవర్ధన వ్యాపారులకు విక్రయించకుండా బైక్‌పై స్వయంగా గ్రామాల్లో తిరిగి విక్రయిస్తున్నారు. పెనుగంచిప్రోలుతో పాటు జగ్గయ్యపేట, నందిగామ, ఖమ్మం జిల్లాలోని మధిరకు వెళ్లి విక్రయస్తూ ఆదాయాన్ని అర్జిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై ఎక్కడ స్టాళ్లు ఏర్పాటు చేసినా తన పండ్లను తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. బైక్‌కు కూడా తాను చేసే ప్రకృతి వ్యవసాయం ఫ్లెక్సీ ఏర్పాటు చేసి విక్రయిస్తుండటంతో వినియోగదారులు కూడా ఆసక్తి కనపరచటంతో పాటు రసాయన ఎరువులు వాడకుండా పండించిన పండ్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు.
పొలంలోనే సేంద్రియ ఎరువుల తయారీ
గోవర్ధన తన పొలంలో ఆవుపేడ, శనగపిండి, బెల్లం, పుట్టమన్ను, గోమూత్రాన్ని పులియబెట్టి జీవామృతం తయారు చేసి పొలంలో చల్లుతున్నారు. గోమూత్రం, శనగపిండి, బెల్లం ముద్దలు చేసి ఘన జీవామృతం బంతులుగా చేసి మొక్కల మొదట్లో వేస్తున్నారు. పండు ఈగ, ఇతర పురుగులు, రోగాలు రాకుండా నీమాస్త్రం పులియబెట్టిన మజ్జిగ, వెల్లుల్లితో పాటు పొగాకు, జిల్లేడు మొదలైన పది రకాల ఆకులతో తయారు చేసిన అగ్నాస్త్రం స్ప్రే చేస్తూ పూర్తిగా సేంద్రీయ పద్ధతులు అవలంబిస్తున్నారు.
పందిరి విధానంలో
కాకర, పొట్ల సాగు
యాపిల్‌బేర్‌తో పాటు ప్రకృతి వ్యవసాయం ద్వారా పందిరి విధానంలో గోవర్ధన కాకర, పొట్ల సాగు చేస్తున్నానే. స్టార్ కాకర వారానికి క్వింటా చొప్పున దిగుబడి వస్తోందని, మార్కెట్‌లో బోర్డు రేటు కిలో రూ.48గా ఉందని తెలిపారు. పొట్ల కాపు దశలో ఉందన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల కూరగాయలు చాలా నాణ్యంగా ఉంటాయన్నారు. స్థానికంగా ఉండే మార్కెట్‌లకు వెళ్లి విక్రయిస్తున్నానన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో వ్యవసాయ ఉత్పత్తులు కలుషితం అవుతున్న వేళ తాను పెద్దగా చదుకోక పోయినా సమాజానికి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించటానికి తనవంతు కృషి చేస్తున్నానని రైతు తెలిపారు.
గతంలో బావుల్లో వరలు దింపే పనులు, ఇతర పనులకు వెళ్లేవాడిని. రెండేళ్ల నుంచి యాపిల్ బేర్ పండ్లు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కొత్తరం యాపిల్ బేర్ పండ్లు దిగుబడి వస్తోంది. ఖర్చులు పోను ఆదాయం బాగానే ఉంది. వచ్చే ఏడాది మరో ఎకరం కౌలుకు తీసుకుని సాగు పెంచుతాను. నీళ్లు నిలబడకుండా ఉండే పొలం యాపిల్ బేర్ సాగుకు బాగుంటుంది. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలకు మంచి డిమాండ్ ఉంది. కూరగాయల ధరలు కూడా ప్రస్తుతం బాగానే ఉన్నాయి.
– ఊరుగుండ్ల గోవర్ధన, రైతు
ప్రకృతి సాగు ఫలప్రదం
ప్రకృతి సాగు ఫలప్రదం
ప్రకృతి సాగు ఫలప్రదం


